సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో తాను కమీషన్ తీసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నందున దానిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదాయం ఎంతో, తన ఆదాయం ఎంతో విచారణకు సిద్ధమని ప్రకటించారు. బీజేపీలో తన ›ప్రస్థానం ఎలా మొదలైందో, రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందో ఎవరు ఏ రకంగా డబ్బు సంపాదించారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. ఎవరిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మొత్తం తెలంగాణ సమాజం ఎదుటే ఉందని వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కుటుంబంతో వ్యాపార భాగస్వామ్యం ఉన్నది కూడా ఎవరికో అందరికీ తెలుసునన్నారు. ’తాను కేసీఆర్‌కు బినామీ కాదు..తనపై ఆరోపణలు చేస్తున్న వారే కేసీఆర్‌కు బినామీలు’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరర్థకంగా మారడంతో అందరూ బాధ పడుతున్నారని, దీనిపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరితే కాంగ్రెస్ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు విషయం పక్కన పెట్టి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుత సీఎం గతంలో ఎంపీగా కాళేశ్వరం అవినీతిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని సీబీఐకి లేఖ రాస్తున్నట్లు చెప్పారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నపుడు సీబీఐ విచారణకు లేని అభ్యంతరం సీఎం అయ్యాక ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరిట కాలయాపన చేసి కేసీఆర్‌ను కాపాడాలనుకుంటే తాను చేసేదేమీ లేదన్నారు.
లంకె బిందెల కోసం వచ్చారా రేవంత్
లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆయన లంకె బిందెల కోసం వచ్చారా అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మళ్ళీ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారని 15 రోజుల్లోనే ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుందనీ, అందులో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఫార్మా కంపెనీల లాబీయింగ్‌కు లొంగిపోయారా అని నిలదీశారు.
మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని..
మోదీ మెడిసిన్‌కు కాలం తీరిపోయిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు... ఆయన ఎప్పుడు ఆ మందు వేసుకున్నార’ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు ఆ మెడిసిన్ రిజెక్ట్ కాదు.. మోదీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని’’ అని వ్యాఖ్యానించారు. ‘బీఆర్‌ఎస్ ఔట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీ అవసరం తెలంగాణకు లేదు, లోక్‌సభ ఎన్నికల్లో చిచాణా ఎత్తేయడం ఖాయం’’ అని అన్నారు.
అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం
‘అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.. కాలయాపన కోసమే ఇదంతా. ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదు. ఫార్మ్స్ బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వస్తుంది. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేదు... ఆ విషయం తెలిసి కూడా దరఖాస్తులకు రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధికోసమే ప్రజలను తమచుట్టూ తిప్పుకుని ఇబ్బందిపెడుతున్నారు’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment