
గుడివాడ టౌన్: ఆంధ్రుల అభిమాన నాయకుడైన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ సొత్తు కాదని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆయన విగ్రహాలకు పసుపు రంగు పులమడం ఎంత వరకు సబబని అన్నారు. గుడివాడ రూరల్ మండలంలో ఎన్టీ రామారావు విగ్రహానికి రంగులు వేసే విషయంలో తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవమని చెప్పారు. ‘1995లో ఎన్టీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దొంగ చంద్రబాబునాయుడు.
ఆయన చనిపోయే వరకు పార్టీలోకి రానివ్వని నీచుడు బాబు. కోర్టుకు వెళ్ళి ఎన్టీఆర్‌కు, పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, పార్టీ గుర్తు, పార్టీ కార్యాలయం తనదేనని ఆదేశాలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. ఎన్టీ రామారావును టీడీపీ వ్యక్తిగా ఎలా గుర్తిస్తారు?’ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహాలన్నీ బంగారు రంగులో ఉంటాయని, ఆయనకు పసుపురంగు పులమడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆయనకు ప్రత్యేక రంగులేమీ లేవన్నారు.
ఒకడు పచ్చ రంగు వేసుకుంటే మరొకరు నీలి రంగు వేసుకుంటారని, ఎవరి ఇష్టం వారిదన్నారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు. ఇటీవల ఆ దిమ్మెపై ఉన్న తన పేరును తొలగించడంతో ఆ పార్టీ పెద్దలను పిలిచి వివరణ కోరానన్నారు. త్వరలో తిరిగి ఏర్పాటు చేస్తామన్న ఆ నాయకులు ఇప్పటివరకు అంతులేరని తెలిపారు. దీంతో తమ కార్యకర్తలు పార్టీ రంగు వేసుకుంటారని, ఇందులో తప్పేమీ లేదని అన్నారు. చంద్రబాబు ప్రకృతి కూడా సహకరించదని, అందుకే గుడివాడలో ప్రకృతి వర్షాల రూపంలో మినీ మహానాడును అడ్డుకుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment