
సాక్షి, కృష్ణా: రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంలో రాములవారి విగ్రహ ధ్వంసంపై మంత్రి కొడాలి ఆదివారం స్పందించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవుడు లాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు ‘డేరా బాబా’ అవతారం ఎత్తారని విమర్శించారు.
రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారని ఫైర్ అయ్యారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చాలెంజ్ విసరడం విడ్డూరమన్నారు. దొడ్డి దారిన మూడు మంత్రి పదవులు వెలగబెట్టి, జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. ప్రజల తిరస్కారానికి గురైన బఫూన్, జోకర్ లాంటి లోకేష్ ఛాలెంజ్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వీకరించాలనడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పిచ్చివాగుడు కట్టి పెట్టకపోతే సహించేది లేదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడితే ఊరికునేది లేదని మంత్రి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment