సాక్షి, నల్లగొండ: జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో చిన్న(ప్రాంతీయ) పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ అనడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. చిన్న పార్టీలు గెలిచి ప్రధాని మోదీకి సపోర్ట్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోంది. ప్రధాని మోదీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. పది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరి అకౌంట్‌లోనూ పైసా వేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.
కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో కేసీఆర్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో పనికిమాలిన నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాడు. వారిని ప్రగతి భవన్ తీసుకువచ్చి బిర్యానీలు పెట్టాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికి కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: దీపావళి ప్రత్యేక రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment