ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పంచ్ ఎలా ఉంటుందో ప్రత్యర్దులకు మరోసారి రుచి చూపించారు. ఇన్నాళ్లుగా నోటికి వచ్చినట్లు దూషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు, ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ లను ఏకకాలంలో ఉతికి ఆరేశారు. తనను సైకో అని,మరొకటని దూషించినా ఓర్పుతో ఉన్న జగన్.. వలంటీర్లపై జరిగిన దాడిపై తీవ్రస్థాయిలో స్పందించక తప్పలేదు. వ్యక్తిగతంగా ప్రత్యర్దుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో పేరుగాంచిన చంద్రబాబుకు ఇది ఒకరకంగా షాక్ వంటిదే. తనకే ఈ విద్య తెలుసు అనుకుంటున్న ఆయనకు తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలకు జవాబు ఇవ్వడం ఎలాగా అని ఆందోళన పడుతుండవచ్చు.
విశేషం ఏమిటంటే ఈ వ్యాఖ్యలలో చంద్రబాబు పేరుకాని, పవన్ కల్యాణ్ పేరు కాని, లోకేష్ పేరు కాని, బాలకృష్ణ పేరుకాని చెప్పకుండానే అంతా విడమరచి చెప్పినట్లు ప్రసంగం చేశారు. వలంటీర్లపై పవన్ కల్యాణ్, చంద్రబాబు తదితరులు చేసిన ఆరోపణలను తిప్పి కొట్టడమే కాక.. వాళ్ల వ్యక్తిగత ప్రవర్తనను సీఎం స్థాయిలో బయటకు తీసుకు వచ్చి తాను మాటల ద్వారా కొడితే ఇలా నషాళానికి అంటుతుంందని వారికి తెలియచేశారు.
‘వలంటీర్లను కారెక్టర్ లేని వీళ్లా విమర్శించేది?’.. అని ఆయన ప్రశ్నించారు. వెంకటగిరిలో జరిగిన చేనేత నేస్తం సభలో ఇది తన చరిత్ర.. అది వారి చరిత్ర అంటూ పోల్చి మరీ పలు అంశాలను వివరించారు. తన ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలు, అమలు చేస్తున్న సంక్షేమ ,అభివృద్ది కార్యక్రమాలను వివరిస్తూనే ఆయన వ్యూహాత్మకంగా వలంటీర్ల ప్రస్తావన తీసుకు వచ్చారు. వలంటీర్లు ఎక్కడనుంచో రాలేదని, మన ఇళ్లలోనివారేనని, అందరికి తెలిసినవారేనని, అలాంటివారు మహిళల ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని దారుణమైన ఆరోపణ చేసి పవన్ కల్యాణ్ పెద్ద తప్పు చేశారని ఆయన ప్రజలకు తెలియచెప్పారు.
✍️ ఇక్కడే ఒక గమ్మత్తు ఏమిటంటే.. పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన వలంటీరే అని పేర్కొనడం. అదేలాగంటే చంద్రబాబుకు పదేళ్లుగా వలంటీర్ గా ప్యాకేజీ స్టార్ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో.. ఏపీలో పనిచేస్తున్న వలంటీర్లు ప్రజలకు సేవచేస్తున్న రత్నాలు, వజ్రాలు అని మెచ్చుకున్నారు. ఇలాంటి వలంటీర్లను దుష్టచతుష్టయం అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. వలంటీర్లకు వ్యతిరేకంగా మొత్తం రచన అంతా రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు అని,మాటలు, యాక్షన్ అంతా దత్తపుత్రుడిది అని ఆయన అన్నారు.
వీరి వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ వీరా వలంటీర్లను విమర్శించేది అని జగన్ చేసిన గర్జనకు సభాస్థలి అంతా మారుమోగింది. చంద్రబాబు, ఆయన సొంత పుత్రుడు, దత్తపుత్రుడు, బావమరిదిల కారెక్టర్ ఎలాంటిదో అందరికి తెలుసు అంటూనే..ఒక్కొక్కరి చరిత్రను బయటపెట్టారు.
✍️ లోకేష్ కొందరు యువతులతో మద్యం సేవిస్తూ, డాన్స్ వేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అలాంటి వ్యక్తి వలంటీర్లను అవమానిస్తాడా? అని జగన్ ప్రశ్నించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, ఒక భార్య ఆయన పై చేసిన ఆరోపణను ముఖ్యమంత్రి ప్రజలకు గుర్తు చేశారు. మహిళలను ప్రలోభ పెట్టి మోసం చేసింది వలంటీర్లా లేక దత్తపుత్రుడా అని ప్రశ్నిస్తూ, మళ్లీ, మళ్లీ పెళ్లి , విడాకులు, ఒక భార్య ఉండగానే మరో మహిళతో సంబందం పెట్టుకున్న వారు వలంటీర్లపై సంస్కారం లేకుండా మాట్లాడతారా అని ఆయన ధ్వజమెత్తారు. వలంటీర్లపై లేనిపోని ఆరోపణలుచేసిన పవన్ కళ్యాణ్ అందరి నిరసనలకు గురైతే,ప్రస్తుతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరింత ఆత్మరక్షణలో పడినట్లయింది.మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన పవన్ పై ఇప్పటికే పరువు నష్టం దావా వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిపై పవన్ రెచ్చిపోయి జైలుకు వెళ్లడానికి సిద్దం అని అన్నారేకాని తన వద్ద తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పలేకపోయారు.
✍️ మరో వైపు జగన్ చేసిన విమర్శలన్నిటికి ఆధారాలు ఉన్నాయి. దాంతో పవన్ వీటికి జవాబు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చంద్రబాబు ఈ మధ్య బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ఒక వ్యాఖ్య చేస్తూ, తాను పలువురు యువతులను టీజ్ చేశానని ఒక ప్రశ్నకు జవాబుగా అన్నారు. ఇప్పుడు దానిని జగన్ తన ఆయుధంగా వాడుకున్నారు. పనిలో పనిగా అప్పుడప్పుడూ దురుసుగా మాట్లాడే బాలకృష్ణను కూడా ఈ బరిలోకి తీసుకు వచ్చారు. ఆడపిల్ల కనబడితే ముద్దు అయినా పెట్టాలి.. కడుపు అయినా చేయాలని ఆయన ఒక సినిమా ఫంక్షన్ లో అనడం అత్యంత వివాదాస్పదం అయింది. ఆ డైలాగును జగన్ ఇప్పుడు ప్రయోగించి బాలకృష్ణను కూడా డిఫెన్స్ లోకి నెట్టారు. నిజంగానే బాలకృష్ణ ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయి ఉండి అలా పిచ్చి డైలాగులు చెప్పడం ఆశ్చర్యపరచింది. దీనికి ఆయన ఇంతవరకు సమాధానం ఇవ్వలేకపోయారు.
✍️ ఒకే దెబ్బలో చంద్రబాబు, ఆయన కుమారుడు , బావమరిదిలకు దిమ్మదిరిగేలా జగన్ చేశారు. పవన్ కల్యాణ్ కైతే పరువు లేకుండా చేశారు. మామూలుగా అయితే ఈపాటికి చంద్రబాబు,పవన్ లు దీనికి కౌంటర్ గా సమాధానాలు ఇచ్చి ప్రతివిమర్శలు చేసేవారు. కాని జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు వారి వద్ద జవాబు లేదు. ఏది ఏమైనా నా ఆంద్రప్రదేశ్లో వ్యక్తిగత దూషణలు హద్దులు దాటిపోతుండడంతో ముఖ్యమంత్రి జగన్ స్పందించవలసిన పరిస్థితి వచ్చింది. అదే విషయాన్ని ఆయన ప్రస్తావించి వలంటీర్లను అవమానించడంతో తాను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల గురించి మాట్లాడవలసి వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లు తమ ధోరణి మార్చుకుంటే మంచిది. లేకుంటే వారు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్దపడవలసిందే.
::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment