ఏపీ రాజకీయాల్లో అపరిచితుడు ఈయనే! | Kommineni Comments On Pawan Kalyan Politics | Sakshi
Sakshi News home page

బహుశా.. ఏపీ రాజకీయాల్లో అపరిచితుడు ఈయనే!

Published Sat, Oct 7 2023 11:53 AM | Last Updated on Sat, Oct 7 2023 4:47 PM

Kommineni Comments On Pawan Kalyan Politics - Sakshi

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అని అందరికి తెలుసు. ఎప్పుడు  ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన ఎన్.డి.ఎ. అంశంపైన, వివిధ ఇతర విషయాలపైన మాట్లాడిన తీరు చూస్తే ఇలాంటి వారు ఏపీ రాజకీయాలలో అవసరమా? అన్న సందేహం వస్తుంది. పొరపాటున ఇటువంటి వ్యక్తులకు అధికారం వస్తే రాష్ట్రం ఏమవుతుందో అన్న ఆందోళన కలుగుతుంది. అదృష్టవశాత్తూ ఆయనే తాను సీఎంగా పనికిరానని చెప్పుకున్నారు. సీఎం పదవి కోరుకుంటే రాదని ఒకసారి, సీఎం పదవి ఇస్తే స్వీకరించడానికి సిద్దమని మరోసారి ఇలా ఏవేవో తోచినట్లు మాట్లాడుతుంటారు.

✍️అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాలలో జరిగిన సభలలో మాట్లాడారు. వాటన్నిటిని విశ్లేషిస్తే అర్ధం అయ్యేదేమిటంటే, ముఖ్యమంత్రి జగన్‌పైన ఆయనకు విపరీతమైన ద్వేషం ఉంది. కోపం ఉంది. కక్ష ఉంది. అసహనం ఉంది. అందుకే ఆయనపై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పిచ్చి, పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పవన్ కళ్యాణే ఆరోపించేవారు. కాని ఇప్పుడు వారిపై అవినీతి కేసులు వచ్చినా, వారే తన స్నేహితులని నిస్సిగ్గుగా చెబుతున్నారు. చంద్రబాబుతో అంత సాన్నిహిత్య బంధం ఏర్పడడంలో రహస్యం ఏమిటా అని జనసేన కార్యకర్తలే మల్లగుల్లాలు పడుతున్నారు.

✍️తాను సీఎం పదవికి సిద్దమని పవన్ కళ్యాణ్‌ ప్రకటించినా, తెలుగుదేశం నేతలు ఎవరూ అందుకు సమ్మతించినట్లు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ను తాము గౌరవిస్తామని, ఆయన కోరినట్లు సీఎం పదవిని షేర్ చేస్తామని ఎవరూ ప్రకటించలేదు. అయినా పవన్ కళ్యాణ్ తాను టీడీపీ పల్లకి మోస్తానని చెబుతున్నారు. గతంలో పొత్తులో ఉన్నప్పుడు ఎంతకాలం టీడీపీ పల్లకీ మోస్తానని ఆవేశంగా ప్రశ్నించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఏమైందో టీడీపీ వారి నుంచి అవమానాలు ఎదురైనా తాను ఆ పల్లకికి బోయిగానే ఉంటానని చెబుతున్నారు.

✍️2019లో ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ డిల్లీ వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి, బీజేపీ పెద్దలను బతిమలాడుకుని ఎన్.డి.ఎ.లో చేరారు. ఈ మధ్య జరిగిన సమావేశానికి కూడా వెళ్లి వచ్చారు. ఎలాగొలా టీడీపీకి, బీజేపీకి మధ్య మధ్యవర్తిగా ఉండి ఆ రెండు పార్టీలను కలపాలని యత్నించారు. కాని అందుకు బీజేపీ అధిష్టానం సుముఖత చూపలేదు. దాంతో ఏమి చేయాలో తోచక, తానే స్వయంగా టీడీపీతో పొత్తులోకి వెళుతున్నట్లు ప్రకటించేశారు. కాని అదే సమయంలో బీజేపీని వదలిపెడుతున్నట్లు చెప్పలేదు. తాజాగా ఎన్.డి.ఎ. నుంచి బయటకు వచ్చినట్లు సంకేతం ఇచ్చినా, మరుసటి రోజే ఎన్.డి.ఎ.లోనే ఉన్నానని తెలిపారు.

✍️బీజేపీతో సంబంధం లేకుండా, వారికి విడాకులు ఇస్తున్నట్లు తెలపకుండా టీడీపీతో పొత్తు ప్రకటన ఏమిటి? బీజేపీ పొత్తు జెండా వదలి, టీడీపీ జెండా మోస్తూ తిరగడం ఏమిటి?మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలోనే, ఆశీస్సులతోనే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం ఏమిటి? వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్‌ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న ఆయన, మిత్రపక్షమైన బీజేపీ పట్ల కూడా అమర్యాదపూర్వకంగానే ప్రవర్తిస్తున్నారు. కాకపోతే అలా చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్‌ పెద్దగా ఫీల్ అవుతున్నట్లు లేదు.  అలాగే రాష్ట్ర బీజేపీ కూడా ఆ అవమానాన్ని భరించడం కూడా ఆశ్చర్యంగానే ఉంది.

✍️రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి చిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణేమో తనకు టీడీపీనే దిక్కు అన్నట్లుగా ఉంటే, బీజేపీ వారేమో తమకు పవన్ కళ్యాణ్ ఊతం అవసరమని అనుకుంటున్నట్లుగా ఉంది. అదే టైమ్‌లో ఒకసారి టీడీపీ బలహీనపడిందని, అందుకే తాను మోస్తున్నానని, ఇంకోసారి అబ్బే తాను అలా అనలేదని ఇలా అవకాశవాద రాజకీయాలను ఆయన చేసుకుంటూ సాగుతున్నారు. టీడీపీ అనుభవానికి జనసేన పోరాట పటిమ జత కావాలట. అంటే టీడీపీకి పోరాడే శక్తి లేదని, అది కేవలం మానిప్యులేషన్స్ చేయగల పార్టీ అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారా?.

✍️తమ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ భయపడుతోందని అయన అంటున్నారు కాని, తాము కలవలేకపోతే జగన్ దరిదాపులకు వెళ్లలేమని పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు భావించాలి. తాను గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు తమ ఇళ్లలో, కార్యాలయాలలో ఉండాలని ఆయన సవాలు చేశారట. ఇలాంటి దిక్కుమాలిన చాలెంజ్ ఈయన తప్ప ఇంకెవరు చేయరేమో! అంటే ఆయన గెలిస్తే కనబడిన వైసీపీ వాళ్లందరిమీద దాడులు చేయిస్తారా? కత్తులు, తుపాకులు తీసుకుని ఎగబడి వారిని చంపేస్తారా?. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయ నేతలు ఎవరైనా మాట్లాడతారా? పది మంది అభిమానులు తన వద్దకు వస్తున్నారు కదా అని ఇష్టారీతిన ఇలా మాట్లాడవచ్చా!

✍️బహుశా జనం పవన్ కళ్యాణ్‌లో ఇలాంటి పిచ్చి  లక్షణాలు ఉన్నాయనే గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడించారని అనుకోవాలా?. ఆయన అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తారట. ఎక్కడైనా మహిళలు కోరుకుంటే నిషేధం పెడతారట. ఇదీ చిత్రమైన హామీనే. ఎక్కడైనా మద్యం తాగవద్దని చెప్పవలసిన నేత తాము ధరలు తగ్గిస్తామని, బాగా తాగవచ్చని చెబుతున్నారంటే వీరికి ఉన్న సామాజిక బాధ్యత ఏమిటో తెలిసిపోతుంది. మహిళలు ఎక్కడ మద్య నిషేధం చేయమంటే అక్కడ చేస్తానని అన్నారంటేనే ఈయన పాలన అనుభవరాహిత్యం అర్ధం అవుతుంది. ప్రజలను మోసం చేయడానికి ఇలా చెబుతున్నారని ఇట్టే తెలిసిపోతుంది.

✍️జగన్ ఇచ్చే ప్రతి పథకానికి ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నానని పవన్ చెప్పారు. మరి వాటివల్లే నాశనం అని ప్రచారం చేసిన ఆయన మరింత నాశనం చేస్తానని చెబుతున్నారా?. ఆయనను ఎవరైనా నమ్ముతారా? పవన్ కళ్యాణ్ ఎన్.డి.ఎ.లో ఉన్నా, లేకపోయినా ఎవరికి నష్టం లేదు. ఆయనకు ఒక ఎమ్మెల్యే లేరు. ఒక ఎంపీ లేరు. ఆయనే గెలవలేకపోయారు. ఆయనేదో బలమైన శక్తిగా  ఊహించుకుని డాంబికాలు పోతున్నట్లుగా ఉంది.

✍️తెలుగుదేశంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆయన జనసేన కార్యకర్తలకు అవినీతిపై రాజీలేని పోరాటం చేయాలని ఎలా చెప్పగలుగుతారు?. అసలు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏమిటి? పదో, పరకో సీట్లు ఇస్తే తీసుకుని టీడీపీకి భజన చేయడమా?లేక ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో పలువురు కోరుకున్నట్లు ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేసుకోవడమా?లేక చంద్రబాబునో, లోకేష్‌నో సీఎంను చేయాలని ప్రజలను కోరడమా?. అసలు క్లారిటీ లేకుండా సభలు నిర్వహిస్తున్న ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణలు అవసరమా?


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement