ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత, మంత్రివర్గ కూర్పుపై ఎవరి వ్యాఖ్యలు వారు చేస్తుంటారు. ప్రత్యేకించి ప్రదాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎలాంటి విమర్శలు చేస్తుందా అని గమనించడం జరిగింది. కాని ఆశ్చర్యంగా ఈ విషయం వరకు టీడీపీ మౌనం దాల్చినట్లు కనిపించింది. కాకపోతే చంద్రబాబు కాని, కొందరు టీడీపీ నేతలు కాని తాము బీసీలకు ఇంకా ఎక్కువ చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నించారు తప్ప సీఎం జగన్ కేబినెట్‌లో ఆయా వర్గాలకు అన్యాయం జరిగిందని కామెంట్ చేయలేకపోయారు.
సీఎం జగన్ తన మంత్రి వర్గ మార్పులు, చేర్పులు చేయడంలో సఫలం అయ్యారని చెప్పడానికి ఇంతకన్నా మరో ఉదాహరణ ఉండకపోవచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలలో ఉమ్మడి ఏపీ చరిత్రలో కాని, విభజిత ఏపీలో కాని ముఖ్యమంత్రులు మంత్రివర్గ మార్పులు చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేయకుండా ఉన్న ఘట్టం దాదాపు లేదని చెప్పాలి.
ప్రత్యేకించి తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ బలపడిన తదుపరి ఈ విమర్శలు సహజంగానే వస్తుండేవి. కాని ఈసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో వచ్చిన అసంతృప్తులకు ప్రాధాన్యం వచ్చిందే తప్ప, ప్రతిపక్షం విమర్శలు చేయలేకపోయింది. జగన్ మంత్రివర్గంలో ఎన్నడూ లేని విధంగా బలహీనవర్గాలకు అత్యధిక ప్రాదాన్యత ఇవ్వడమే కారణమని చెప్పాలి. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన పది మందికి మంత్రి పదవులు దక్కాయి. ఎస్సీలకు అయిదు స్థానాలు, ఎస్టీ, ముస్లిం వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు వచ్చాయి.
గతంలో ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా పదవులు కేటాయిస్తే, మీడియాలో వచ్చే బ్యానర్ హెడింగ్ ఏమిటంటే సామాజిక న్యాయానికి పెద్ద పీట అనో, లేక బీసీలకు అత్యదధిక మంత్రి పదవులు అనో పెట్టేవి. కాని ఈసారి మాత్రం ఆ విషయం ప్రముఖంగా కనిపించకుండా ఒక వర్గం మీడియా ప్రయత్నించింది. అదే సమయంలో భగ్గుమన్న చిచ్చు అసంతృప్తి జ్వాలలు, తుస్సు ఇలాంటి హెడింగ్‌లు వచ్చాయి.
ఏ అధికార పార్టీలో అయినా మంత్రి పదవులు ఇవ్వడం అనేది కత్తిమీద సామె. అందులోను వైఎస్ జగన్ తాను రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తామని 2019లోనే చెప్పారు. తదనుగుణంగానే ఆయన ఆ కార్యక్రమం నిర్వహించడానికి చాలా కసరత్తు చేశారు. అయినా అసంతృప్తులు సహజం. వాటిని రిపోర్టు చేయడం కూడా అభ్యంతరకరం కాదు. అదే సమయంలో మంత్రివర్గంలో ఉన్న సానుకూల అంశాలను కూడా ప్రముఖంగా ఇవ్వాలి.
కాని అందులో కూడా కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకే చందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇచ్చింది. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనిని ఆయన వర్గం మీడియా భుజాన వేసుకుంది. చంద్రబాబు ఏపీలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేసినా మీడియా సమావేశాలు పెట్టో, జూమ్‌లోనో విమర్శలు కురిపిస్తుంటారు. తీవ్రమైన భాషలో విరుచుకుపడుతుంటారు. కాని ఈసారి ఎందుకో ఆయన ఈ అంశంపై మౌనం దాల్చారు.
ఆయనకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని ఎక్కడైనా ట్విటర్‌లో ఏమైనా కామెంట్ చేశారేమో చూస్తే ఏమీ కనిపించలేదు. మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు.దీనిని బట్టి కొత్త మంత్రివర్గంపై ఏదైనా వ్యతిరేక వ్యాఖ్య చేస్తే బలహీనవర్గాలకు తెలుగుదేశం వ్యతిరేకి అన్న ముద్రపడుతుందేమోనని భయపడ్డారని అనుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కమ్మ సామాజికవర్గానికి ఏపీ చరిత్రలో తొలిసారిగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదు. దానిపై విమర్శలు చేయడానికి చంద్రబాబు కాని, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా కాని సాహసించలేదు. నేరుగా ఆ విషయం ప్రస్తావిస్తే తమ సామాజికవర్గానికి పదవి ఇవ్వకపోతే స్పందించారన్న విమర్శ వస్తుందని బయపడి ఉండవచ్చు.
కమ్మతో పాటు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలకు వేరే పదవులు ఇచ్చినా మంత్రి చాన్స్ ఇవ్వలేకపోయారు. అయినా చంద్రబాబు ఎందుకు విమర్శ చేయలేకపోయారంటే తాను కూడా బ్రాహ్మణ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. పైగా గిరిజనులు, ముస్లింలకు నాలుగున్నర ఏళ్లపాటు మంత్రి పదవి ఇవ్వలేదు. అవన్ని సహజంగానే బయటకు వస్తాయి కనుక ఆయన నోరు విప్పలేదని అనుకోవాలి. కానీ వైఎస్ జగన్ కొన్ని వర్గాలకు ఎందుకు పదవులు ఇవ్వలేకపోయారంటే దానికి కారణం సామాజికవర్గాల కూర్పులో ఎదురైన చిక్కులు, మంత్రుల సంఖ్యపై రాజ్యాంగపరంగా ఉన్న ఇబ్బంది, బలహీనవర్గాలకు అత్యదిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనే అని చెప్పనవసరం లేదు.
సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా రెడ్డి, కాపు వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, బీసీలకు అత్యదిక స్థానాలు కేటాయించారు. అలాగే ఎస్సీలకు గతంలో మాదిరి ఐదు స్థానాలు ఇచ్చారు. ఏపీలో ఉన్న సామాజికవర్గాల ప్రకారం కమ్మ వర్గం లో మెజార్టీ ఎటూ వైఎస్సార్‌సీపీకి దూరంగానే ఉంటుంది. అందువల్ల ఆ వర్గానికి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదని అనుకుని ఉండవచ్చు. మంత్రి పదవి కోల్పోయన కొడాలి నాని కూడా దానిపై పెద్దగా సీరియస్‌గా లేనని స్పష్టం చేశారు. ఆయనకు వేరే క్యాబినెట్ హోదా పదవి ఇస్తున్నారు.
వైశ్య ఎమ్మెల్యే అయిన కొలగట్ల వీరభద్రస్వామికి ఉప సభాపతి పదవి ఇవ్వడం ద్వారా కొంత బాలెన్స్ చేసే యత్నం చేశారు. క్షత్రియ వర్గ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు చీప్ విప్ పదవి ఇచ్చారు. బ్రాహ్మణ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు కమ్మ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన కుమారుడు లోకేష్ తో సహా ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు.వీటితో పాటు స్పీకర్ పదవి కూడా కమ్మ వర్గానికే లభించింది. కాని జగన్ అలా చేయలేదు. రెడ్డి వర్గానికి నాలుగు మంత్రి పదవులే ఇచ్చారు. శాసనసభలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు 48 మంది ఉన్నారు. వీరంతా వైఎస్సార్‌సీపీ కావడం ఒక ప్రత్యేకత.
టీడీపీ తరపున ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. దీని ప్రకారం ప్రతి పన్నెండు మందికి ఒక పదవి ఇచ్చినట్లయింది. గతంలో చంద్రబాబు తన ప్రభుత్వంలో ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చి, ఆ తర్వాత దానిని నాలుగు చేశారు. కాని అందులో ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కావడం ఒక ప్రత్యేకత. ఒరిజినల్ టీడీపీ రెడ్డి ఎమ్మెల్యే ఒక్కరికే మంత్రి పదవి వచ్చిందన్నమాట. కాపు వర్గం వారు వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పక్షాన ఇరవై ఇద్దరు గెలుపొందారు. ఈ వర్గం వారు నలుగురు మంత్రి పదవులు పొందారు. . అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి మంత్రి పదవి వచ్చింది. బీసీల విషయం చూస్తే వైఎస్సార్‌సీపీ తరపున గెలుపొందినవారు 28 మంది ఉన్నారు. వీరిలో పది మంది మంత్రి పదవులు పొందారు.
ఈ లెక్కన చూస్తే ప్రతి రెండున్నర మందిలో ఒకరికి పదవి వచ్చిందన్నమాట. ఇది చాలా అరుదైన విషయమే. బీసీలకు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఈ పదవులు దక్కలేదు. ఎస్సీలు వైఎస్సార్‌సీపీ తరపున 27 మంది గెలిచారు. వీరిలో ఐదుగురికి పదవులు దక్కాయి. ఈ లెక్కన ప్రతి ఐదుగురిలో ఒకరికి పదవి కల్పించారు. ఇలాంటి కూర్పు గతంలో ఎన్నడూ జరగలేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కాని, ఆ వర్గం మీడియా కాని ఈ కూర్పుపై విమర్శలు చేయలేపోయింది. కాని టిడిపి ఏపీ అద్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బీసీలకు పదవులు ఇచ్చినంత మాత్రాన ఏమి అవుతుందని ప్రశ్నించారు. మరి ఇదే ప్రశ్న చంద్రబాబును కూడా అడిగి ఉండాల్సింది.
ఇక ఒక పత్రిక విశ్లేషణ చేస్తూ ఒక సామాజికవర్గాన్ని మార్చితే అదే సామాజిక వర్గం మరో నేతను ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. విజ్ఞత లేకుండా ఏదిపడితే అది రాయడానికి అలవాటు పడ్డ ఆ పత్రిక ఒక వేళ అదే సామాజికవర్గానికి పదవి ఇవ్వకపోతే, ఆ వర్గానికి అన్యాయం చేశారని గొంతెత్తి ప్రచారం చేసేది. వైఎస్సార్‌సీపీలో పదవులు రాక అసంతృప్తికి గురి అయిన నేతలను రెచ్చకొట్టడానికి వీలైనంతగా యత్నించారు. కాని వారు ఒక్కొక్కరు సర్దుకుపోతుంటే ఈ మీడియాకు చెందిన వారు ఉస్సూరు అంటూ కనిపించారట.
151 మంది ఎమ్మెల్యేలు అదికార పార్టీకి ఉంటే ఇరవై అయిదు మంత్రి పదవులే ఉన్నాయి. దానిని కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కువ హడావుడి చేస్తారని టీడీపీ మీడియా వారు ఆశించారు. కాని ఆయన వెంటనే పరిస్థితి అర్దం చేసుకుని ముఖ్యమంత్రిని కలిశారు. నిజానికి బాలినేని ఈ మాత్రం అసంతృప్తి అయినా వ్యక్తం చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే బాలినేని ముఖ్యమంత్రి జగన్‌కు బంధువు కూడా అవుతారు. మాజీ హోం మంత్రి సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కొంత అతి చేశారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఏమి చెబితే అదే ఫైనల్ అన్న ఆమె ఇప్పుడు పదవి పోతే రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవి పోతే ఇంత బాదపడతారన్నమాట.
అదే సమయంలో కొడాలి నాని, పేర్ని నాని వంటివారు మాత్రం మంత్రి పదవులను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. జగన్ మంత్రులకు కేటాయించిన శాఖలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బొత్స సత్యనారాయణకు విద్యా శాఖ, ఆదిమూలం సురేష్‌కు మున్సిపల్ శాఖ ఇచ్చారు. బొత్స మాట తీరుపై ఈ సందర్భంగా వ్యంగ్య వ్యాఖ్యలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కాబినెట్‌లో కె.ఈ ప్రభాకర్ విద్యా శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయనకు అధ్యక్షా అన్న పదం నోటీకి తిరిగేది కాదు. అద్యచ్చా అని అనేవారు. అంత మాత్రాన ఆయన పనికి రాకుండా పోలేదు కదా?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖను ఇవ్వడం ద్వారా ఒక సవాలును అప్పగించారని అనుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖను ఇచ్చారు. విశేషం ఏమిటంటే గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించిన ఈలి ఆంజనేయులు, పి.మాణిక్యాలరావులు కూడా ఇదే శాఖను నిర్వహించారు. రెండుసార్లు ఎన్నికైన బూడి ముత్యాలరావుకు బీసీ కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని, కీలకమైన పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు.
యువకుడైన అమరనాథ్‌కు పరిశ్రమలు, ఐటీ శాఖలు ఇచ్చారు. గిరిజన సీనియర్ ఎమ్మెల్యే రాజన్నదొరకు ఉప ముఖ్యమంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ దక్కింది. నారాయణస్వామి, అంజాద్ భాషలు తమ ఉప ముఖ్యమంత్రి పదవులను నిలబెట్టుకున్నారు. కొత్త మంత్రి అయిన అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి ఆయనపై మంచి విశ్వాసం ఉంచారని అనుకోవచ్చు. మరో ఆసక్తికర అంశం గుర్తు చేయాలి. ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అసెంబ్లీకి రాకుండా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆమె కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నా వీరు అనుమతించలేదు.
ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు రోజా మంత్రి అయ్యారు. కాని చంద్రబాబు శాసనసభకు రాని పరిస్థితిని సృష్టించుకున్నారు. ఏదో సాకు చూపి తనకు తాను అసెంబ్లీ నుంచి బహిష్కరించుకున్నారు. విధి విలాపం అంటే ఇదేనేమో! ఏది ఏమైనా మంత్రివర్గంలో బీసీలకు ఇన్ని ఎక్కువ పదవులు ఇచ్చినా, ఎవరూ అభ్యంతరపెట్టలేని పరిస్థితి ఏర్పడడం జగన్ సక్సెస్ అని చెప్పారు. ఆయన తీసుకు వచ్చిన సామాజిక ఫార్ములా ఇలాగే కొనసాగి, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు కాపులను కూడా కలుపుకుని వెళ్లగలిగితే జగన్‌కు తిరుగు ఉండదనే చెప్పవచ్చు. అలా అని అతి విశ్వాసం మంచిది కాదు. ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తం చేసిన అసంతృప్తి, అలాగే మరికొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు అన్నిటిని గమనంలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా సీఎం జగన్‌కు ముఖ్యమైన పాయింటే అవుతుంది.
కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment