విజయవాడ అంతా మురిసింది. లక్షలాది మంది ప్రజలు మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జై కొట్టారు. ఆయన చేసిన ప్రసంగం సైతం ఆకర్షణీయంగా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణ సందర్భంలో జరిగిన ఈ సభలో జగన్ విపక్షాలపైన, తెలుగుదేశం అధికారిక ఈనాడు మీడియాపై విసిరిన విసుర్లు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.
✍️ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు వంటివారు నయా పెత్తందార్లని, అంబేడ్కర్ భావజాలానికి వ్యతిరేకులని, కొత్త రూపంలో అంటరానితనాన్ని అమలు చేసే యత్నం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఆయన తన స్పీచ్‌లో ఏపీలో అంటరానితనాన్ని కొత్తరూపంలో పెత్తందార్లు ఎలా ప్రదర్శిస్తున్నారో సోదాహరణంగా వివరిస్తున్నప్పుడు ప్రజలలో హర్షాతిరేకాలు కనిపించాయి.
✍️జగన్ సభలో ఉన్నంతసేపు వచ్చిన స్పందన చూస్తే బలహీనవర్గాలలో ఆయన పట్టు తిరుగులేనిదని మరోసారి రుజువైంది. తన స్పీచ్‌ను ఆయన రెండు భాగాలుగా చేసుకుని మాట్లాడారు. తాను అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నది వివరించడానికి వివిధ స్కీములను వివరించారు. మరో భాగంలో పెత్తందార్లు, పేదలకు మధ్య సాగుతున్న పోరాటాన్ని తెలియచేశారు. పలుమార్లు ఆయన నా..నా..నా..నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంటూ ప్రస్తావించడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికలకు ఆయన టోన్ సెట్ చేసినట్లనిపిస్తుంది.
✍️ఇప్పటికే సామాజిక సాధికారికత పేరుతో బలహీనవర్గాల యాత్రలను నిర్వహిస్తున్న జగన్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ద్వారా ఆ వర్గాలలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపారు. అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తున్నది తెలియచెబుతూ తన ప్రభుత్వంలో వివిధ పదవులలో బలహీనవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేశారు. నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం, స్థానిక సంస్థలలో ఏభై శాతంపైగా పదవులు ఈ వర్గాలకే కేటాయించడం, క్యాబినెట్‌లో పదిహేడు మందికి బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం తదితర అంశాలను వివరించారు. బలహీనవర్గాలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తెచ్చామని, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అందులో భాగమేనని ఆయన గుర్తు చేశారు.
✍️కొత్త రూపం దాల్చిన అంటరానితనాన్ని ఆయన విశ్లేషిస్తూ, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం ఈ పెత్తందార్లకు నచ్చడం లేదని, తద్వారా వారు అంటరానితనాన్ని కొత్త రూపంలో చూపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు టైమ్‌లో అసలు ప్రభుత్వ బడులను పట్టించుకోలేదని ఆయన చెప్పడంతో పాటు ఆంగ్ల మీడియం గురించి కూడా ప్రస్తావించారు. ఈనాడు పత్రికలో అంబేడ్కర్ తెలుగు మీడియంలోనే చదవాలన్నారని రాసిన కథనంపై ఆయన మాట్లాడుతూ పచ్చి అబద్దాలను ఈ మీడియా చెబుతోందని, అంబేడ్కర్ నాలుగో తరగతిలోనే ఆంగ్ల మీడియంలో మంచి మార్కులు తెచ్చుకుంటే ఆయన బంధువులు అభినందించారని పేర్కొన్నారు.
✍️తమ పిల్లలు, తమ మనుమళ్లు మాత్రం ఆంగ్లంలో చదవాలని, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద పిల్లలు ఆంగ్ల మీడియాలో విద్య నభ్యసించరాదని రామోజీరావు వంటివారు ప్రచారం చేస్తున్నారు.. ఇది కొత్త తరహా అంటరానితనమేనని జగన్ అన్నారు. చివరికి పేద పిల్లలకు టాబ్‌లు అందచేసినా రామోజీరావు సహించలేకపోతున్నారని, దానిపై కూడా విషపు రాతలు రాసే నీచపు స్థాయికి ఈనాడు దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. వృద్దులకు ఇళ్లవద్దే పెన్షన్ ఇస్తుంటే వారు ఓర్చుకోలేకపోతున్నారని, ఇది అంటరానితనం కొత్తరూపమేనని ఆయన అన్నారు.
✍️తన ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినా దానిని కప్పిపుచ్చాలని ప్రతిపక్షం, వారి మీడియా యత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇలా తన ప్రభుత్వ కార్యక్రమాలను, అంబేడ్కర్ ఆశయాలతో పోల్చుతూ సామాజిక న్యాయం తన ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పే యత్నం చేశారు. గతంలో చంద్రబాబు దళితులను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారని, బీసీల తోకలు కట్ చేస్తానని అన్నారని, ఆయనకు బలహీనవర్గాలంటే చులకన అని జగన్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ రాజధానిలో దళితుల అస్సైన్డ్ భూములను పెత్తందార్లు కాజేశారని ఆయన అన్నారు. ఈ రకంగా మొత్తం తన స్పీచ్ అంతటిని బలహీనవర్గాల గుండెల్లో నిలబడిపోయేలా జగన్ ప్రసంగం సాగిందంటే అతిశయోక్తి కాదు.
✍️ఈనాడు పత్రిక శుక్రవారం నాడు ఎంత నీచంగా కధనాలు ఇచ్చిందంటే మాటలలో వర్ణించడం కష్టం. జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత లేదంటూ పిచ్చి ప్రేలాపనలకు దిగింది. వార్తాపత్రికగా కన్నా, తెలుగుదేశం కరపత్రిక కన్నా హీనంగా స్టోరీలను వండి, ప్రజల దృష్టిలో మరింత పలచన అయింది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలను ఇష్టారాజ్యంగా చేస్తూనే, మరోవైపు ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్చ లేదని అబద్దాలు చెబుతోంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజున ఆ ఘట్టాన్ని ఎంత గొప్పగా రాసింది. అదే ఏపీలో ప్రపంచంలోనే అతి భారీ విగ్రహావిష్కరణ చేస్తే ఏ స్థాయిలో విషం కక్కారో గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి.
✍️నిజానికి ఇలాంటి ఘట్టాలు జరిగినప్పుడు ముందుగా దానికి సంబంధించిన విశేషాలు ప్రజలకు తెలియచెప్పాలి. అంబేడ్కర్ విగ్రహం స్థాపనకు ఏ రకంగా కృషి జరిగింది. ఇందుకోసం ఏఏ వస్తువులను ఎలా వినియోగించారు. ఎంత స్టీల్, ఎంత సిమెంట్ వాడారు?. పార్క్ తయారీకి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, కన్వెన్షన్ సెంటర్లు మొదలైన విశేషాల గురించి తెలియచేస్తూ కధనాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఏవైనా లోటుపాట్లు ఉంటే వార్తలు ఇవ్వవచ్చు. అలా చేయకుండా ఈనాడు మాత్రం పచ్చి పాపంగా పిచ్చి,పిచ్చిగా ప్రభుత్వ వ్యతిరేక కధనాలతో జగన్ ప్రభుత్వంపై పడి తెగ ఏడ్చింది.
✍️మంత్రి అంబటి రాంబాబు అన్నట్లు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించడాన్ని తట్టుకోలేక ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ ఏడ్చేశాయి. దానిని అక్షర సత్యం చేసేలానే ఈ మీడియా పనిచేస్తోంది.అంబేడ్కర్ విగ్రహావిష్కర నేపథ్యంలో స్టేడియంలో సభలో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించడానికి వెళ్లారు. ఆ సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుందని చెప్పాలి. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో బలహీనవర్గాలపై విపరీత ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఆందోళన చెందుతున్న తెలుగుదేశం నేతలు విగ్రహానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు, కొందరైతే మరీ తీవ్రవాదంతో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.
✍️అది నిజమే అయితే టీడీపీ తన గొయ్యి తనే తవ్వుకున్నట్లవుతుంది. అసలు బలహీనవర్గాలలో టీడీపీ పట్టు కోల్పోయిందని అంచనాలు ఉన్న సమయంలో టీడీపీ నేతలు అసహనంతో ఏమైనా వ్యాఖ్యలు చేస్తే, కాస్తో, కూస్తో ఇంకా ఎవరైనా టీడీపీలో ఉన్న బలహీనవర్గాలు కూడా వారికి ఒక నమస్కారం చేసి వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతారని గమనించాలి. గతంలో ఇలాంటి ఘట్టాలు జరిగితే సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని లేదా నిర్వాహకులకు అభినందిస్తుండేవి. కాని చంద్రబాబు రాజకీయాలలో తెలుగుదేశాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది.
ఇదీ చదవండి: పెత్తందారీ పోకడలూ అంటరానితనమే
✍️ఏమి చేసినా తిట్టడానికే టీడీపీ పరిమితం అవుతోంది. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు మీద కూడా టీడీపీ అలాగే రోధిస్తున్నట్లుగా ఉంది. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా కన్నీరు, మున్నీరుగా విలపిస్తూ కధనాలు ఇచ్చి ప్రజల మనసులలో విషం నింపాలని యత్నించాయి. కాని ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. వీరు ఎంతగా విషం చిమ్మినా అది వారికే నష్టం. ఎందుకంటే ఎల్లో మీడియాను ప్రజలు నమ్మడం మానేశారు. ఏది ఏమైనా అంబేడ్కర్ విగ్రహావిష్కరణను ఒక చారిత్రక సన్నివేశంగా మలచి, విజయవాడ ప్రతిష్టను, ఆంధ్రప్రదేశ్ కీర్తిని దశదిశలా చాటినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment