చంద్రబాబుతో రామోజీ ‘క్విడ్‌ ప్రో కో’.. అసలు కథ ఇది! | Kommineni Srinivasa Rao Fires On Eenadu Ramoji Rao | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో రామోజీ ‘క్విడ్‌ ప్రో కో’.. అసలు కథ ఇది!

Published Thu, Apr 11 2024 11:35 AM | Last Updated on Thu, Apr 11 2024 12:53 PM

Kommineni Srinivasa Rao Fires On Eenadu Ramoji Rao - Sakshi

తెలుగుదేశం పార్టీతో ఈనాడు మీడియా క్విడ్ ప్రోకో ఏమిటో ఇప్పుడు తేటతెల్లమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఈనాడు అధినేత రామోజీరావు క్విడ్ ప్రో కో ఏమిటో తేలిపోయింది. సుప్రీంకోర్టు మార్గదర్శి అక్రమంగా సేకరించిన డిపాజిట్ల వ్యవహారంలో నిగ్గు తేల్చడం కోసం ఇచ్చిన తీర్పుతో ఈనాడు ఏపీలో దందా ఎందుకు చేస్తుందో స్పష్టంగా ప్రజలందరికీ తెలిసింది.

రామోజీరావు గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ పేరుతో అక్రమంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేయడం, దానిపై వివాదం రావడంతో తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి ఆ డబ్బు డిపాజిట్దారులకు చెల్లించడం తెలిసిందే. అయితే నిజంగా రామోజీ ఎవరికి ఎంత మొత్తం చెల్లించారన్నది ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడారు కాబట్టి ఈ విషయం ఇంతవరకు వచ్చింది. లేకుంటే ఈ వ్యవహారాలలో లోగుట్టు ఎవరికి తెలిసేది కాదు. డిపాజిట్లు సేకరించే పవర్ తనకు లేదని తెలిసినా కూడా మార్గదర్శి మళ్లీ అదే ప్రకారం రశీదుల పేరుతో డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ సీఐడీ విచారణ చేసి సుమారు 800 కోట్ల నల్లధనం చలామణి అయిందని అబిప్రాయపడింది.

2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై కూడా రామోజీ ఇష్టం వచ్చినట్లు వార్తలు ఇచ్చేవారు. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కా డాంటే అంటూ ఒక దారుణమైన సంపాదకీయాన్ని అప్పట్లో మొదటి పేజీలో ప్రచురించారు. దాంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మండింది. అదే తరుణంలో మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందన్న సమాచారం, ఫిర్యాదు రావడంతో రామోజీ ఎంత గొప్పవాడో, నీతిమంతుడో తేల్చడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ క్రమంలోనే రిజర్వు బ్యాంక్ చట్టం 45-S ఉల్లంఘించి రామోజీకి చెందిన మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేస్తోందని కనుగొన్నారు.

దీంతో, రామోజీ తన చానళ్లు కొన్నిటిని అమ్మి డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించవలసి వచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్‌ మీద విపరీతమైన కోపం పెంచుకున్న రామోజీ అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్సార్‌ కుటుంబంపై దారుణమైన కథనాలు రాస్తూ వచ్చారు. అనూహ్యంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో రామోజీ తనకు ఎదురు లేదని భావించారనుకోవాలి. దానికి తగ్గట్లుగానే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో కొందరు కేంద్ర మంత్రులను తనవైపు తిప్పుకున్నారు. దివంగత నేత ఎస్.జైపాల్ రెడ్డి వంటివారితో సన్నిహిత సంబంధాలు నెరపారు. తద్వారా సోనియాగాంధీని కూడా రామోజీ ప్రసన్నం చేసుకున్నట్లు చెబుతారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎటూ ఆయనకు సొంత మనిషే. బీజేపీలో సీనియర్ నేత వెంకయ్యనాయుడు సైతం రామోజీ పట్ల విదేయతతో ఉండేవారు. ఆ రకంగా ఆయా పార్టీలలో తనకు అనుకూలంగా ఉన్న వారికి మీడియా కవరేజీ బాగా ఇస్తూ, ఇష్టం లేనివారిపై వ్యతిరేక కథనాలు రాస్తూ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం సాగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రులు అయిన కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో సత్సంబందాలు సాగించారు. రామోజీ జోలికి వెళ్లవద్దని తమకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని వీరి అనుచర వర్గాలు చెబుతుండేవి.

అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించి రాజకీయాలలోకి వచ్చారు. వైఎస్సార్‌ మరణంతో కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని మెజార్టీ ఎమ్మెల్యేలు భావించినా, అధిష్టానం అంగీకరించలేదు. ఆ తర్వాత కాలంలో ఓదార్పు యాత్ర వ్యవహారంలో అధిష్టానంతో విబేధించినా వైఎస్‌ జగన్‌ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. రామోజీరావు ఏమి ఊహించారో కానీ, ఆనాటి నుంచి కూడా వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా స్టోరీలు ఇచ్చేవారు.

వైఎస్ జగన్‌పై సీబీఐ కేసులు వచ్చేలా చేయడంలో రామోజీకి కూడా ఎంతో కొంత పాత్ర ఉందని నమ్మేవారు లేకపోలేదు. చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటిని కప్పిపుచ్చడం, జగన్ కేసులలో ఇష్టారీతిన వార్తలు రాయడం చేసేవారు. సీబీఐ దర్యాప్తు పేరుతో వీరు నానా చెత్త అంతా రాసేవారు. ఒక తరుణంలో రామోజీ, వైఎస్‌ జగన్‌ల మధ్య రాజీ చేయాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు. కానీ, అవి ఫలించలేదు. రామోజీ తనకు ఎదురులేదని, ఏ ముఖ్యమంత్రి అయినా తన వద్దకు వచ్చి చేతులు కట్టుకు కూర్చోవలసిందే అన్నట్లు భావించేవారు.

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్నిసార్లు రామోజీని కలిసినా, సొంత వ్యక్తిత్వంతో ఉండేవారు. అది రామోజీకి నచ్చేది కాదని చెబుతారు. తదుపరి ఎన్టీఆర్ను చంద్రబాబు సీఎం సీటు నుంచి లాగిపారేయడంలో రామోజీ సలహా, సంప్రదింపులు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఈనాడు మీడియాలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నీచమైన కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వారం, వారం రామోజీ వద్దకు వెళ్ళి మంతనాలు జరిపేవారు. అదేదో ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకుంటున్నట్లుగా రామోజీ ఫీల్ అవుతుండేవారని అంటారు. ఆ క్రమంలో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగా, ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా వైఎస్‌ జగన్‌పై విద్వేషపూరిత కథనాలు ఇచ్చేవారు.

చంద్రబాబు ఎటూ తన మనిషే కనుక, కేసీఆర్‌ను కూడా తన దారిలో పెట్టుకోగలిగారు. కేసీఆర్ కూడా రామోజీతో తగాదా ఎందుకులే అని కాస్త తగ్గారని చెప్పాలి. అయినా వైఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ఏపీలో ఉంటూ పార్టీని విజయవంతంగా నడపడం రామోజీకి ఇష్టం ఉండేది కాదు. దాంతో చంద్రబాబుకు జాకీలేస్తూ, వైఎస్‌ జగన్‌పై విషం చిమ్ముతూ వార్తలు రాయడం అలవాటు చేసుకున్నారు. కానీ, చంద్రబాబు తన పాలనలో విఫలం అయిన సంగతిని రామోజీ పసికట్టలేకపోయారు. 2019లో కూడా చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వస్తారని ఆయన అంచనా వేసుకున్నారు. దానికి తగ్గట్లే ఈ ఎన్నికలలో కూడా వైఎస్‌ జగన్‌పై విపరీత వ్యతిరేక ప్రచారం చేశారు. జనం దానిని పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీకి పట్టంకట్టారు.

వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా కాస్త సమతుల్యత పాటించి ఉంటే ఎలా ఉండేదో కాని,  మొదటి నుంచే ప్రభుత్వంపై విమర్శలతో వార్తలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా మానసికింగా సిద్దం అయి వీరందరికి కలిపి దుష్టచతుష్టయం అని పేరు పెట్టారు. దేశ చరిత్రలో సీఎం జగన్ పైన, ఆయన   ప్రభుత్వంపైన ఈనాడు మీడియా  రాసినన్ని వ్యతిరేక కథనాలు ఏ మీడియా , ఏ రాష్ట్రంలోను రాసి ఉండదు. ముఖ్యమంత్రి జగన్ కొంతకాలం ఓపిక పట్టకపోలేదు. అయినా రామోజీ తగ్గలేదు. ఎందుకంటే వైఎస్సార్‌ మరణం తర్వాత తనకు ఎదురు లేదన్నది ఆయన అభిప్రాయం.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, తన పనులకు ఇబ్బంది లేకుండా చేసుకునేవారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వచ్చి రామోజీని కలిసి వెళ్లారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలాగే న్యాయ వ్యవస్థలో తమకు అనుకూలమైన కొందరి ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునేవారు. అందులో భాగంగానే విభజిత ఏపీ హైకోర్టు హైదరాబాద్ నుంచి తరలివెళ్లడానికి ముందు రోజు తన మార్గదర్శిపై ఉన్న కేసును కొట్టివేయించుకోగలిగారు. కొన్ని నెలలవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

కానీ, ఈ కేసును వేసిన ఉండవల్లి అరుణకుమార్‌కు కాస్త ఆలస్యంగా విషయం తెలిసింది. వెంటనే దానిపై ఆయన మళ్లీ పోరాటం ఆరంభించారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. చాలాకాలం అది విచారణ జరగలేదు. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా! న్యాయ వ్యవస్థ కూడా స్పందించకుండా ఉండలేదు కదా! చంద్రబాబు, కేసీఆర్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నంతకాలం ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వకుండా రామోజీ చూసుకోగలిగారు. దాంతో ఉండవల్లి తనను ఏమీ చేయలేరని అనుకునేవారు.  ఆ దశలో వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావడం, ఏపీ ప్రభుత్వం ఇందులో ఇంప్లీడ్ కావాలని ఉండవల్లి కోరడం, ఆ ప్రకారం హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయడంతో రామోజీ చక్రబంధంలో ఇరుకున్నట్లయింది. ఈ పరిణామం రామోజీలో మరింత కక్ష పెంచింది. విద్వేషాన్ని రగిల్చింది.

నిజానికి జర్నలిజాన్ని.. తన ఇతర వ్యాపారాలతో ముడి పెట్టకూడదన్నది ప్రాథమిక సూత్రం. ఆయన గాజు ఇంటిలో ఉన్నానని మర్చిపోయారు. రామోజీ దానిని విస్మరించి సీఎం జగన్‌పై విపరీతమైన కక్షపూరిత కథనాలు ఇవ్వడం సాగించారు. అయినా సీఎం జగన్ పట్టించుకోలేదు. రామోజీ ఎంతవరకు వెళ్లారంటే ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్రచార ప్రకటనలను కూడా వదలుకుని, మొదటి పేజీలో ముఖ్యమంత్రి జగన్‌పై ద్వేషపూరిత కథనాలు రోజూ ఇచ్చే వరకు వెళ్లారు. అయినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పట్టించుకోలేదు. ఈ దశలో మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలు ప్రభుత్వం దృష్టికి రావడం, సీఐడీకి కేసు అప్పగించడం, అందులో అనేక అక్రమాలు ఉన్నట్లు కనుగొనడం, చిట్టీలను నిబందనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారని తేల్చడం వంటి పరిణామాలు మార్గదర్శికి షాక్ ఇచ్చాయి.

రామోజీ అసలు నిబంధనలే ఉల్లంఘించరనుకునే వారందరికీ సీఐడీ చేసిన విచారణతో కనువిప్పు అయింది. రామోజీ తన మార్గదర్శి ద్వారా ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు వసూలు చేస్తున్న విషయాన్ని ఏపీ సీఐడీ గుర్తించింది. అందులో ఎక్కువ భాగం నల్లదనం ఉన్నట్లు గుర్తించి, ఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు కూడా తెలిపింది. రామోజీకి ఉన్న పలుకుబడి రీత్యా అవి పెద్దగా ముందుకు వెళ్లినట్లు అనిపించదు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోవడం వల్లే తన గుట్టుమట్లన్నీ బయటపడ్డాయన్నది రామోజీ భావన.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో ఏ  చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న రూల్ పాటించకపోయినా, గోరంతలు, కొండంతలు చేసి రాసే ఈనాడు, తన మార్గదర్శిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునే యత్నం చేసేది. సీఐడీ వారిపైనే ఎదురుదాడి చేసేది. అయితే, న్యాయ వ్యవస్థ ద్వారా రామోజీ, ఆయన కోడలు అరెస్టు కాకుండా, కేసు వేగంగా ముందుకు సాగకుండా తప్పించుకుంటున్నారు. ఆ కేసులు అలా ఉంటే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. మొత్తం కేసును రీ-ఓపెన్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా విచారణ చేయించాలని తెలంగాణ హైకోర్టును కోరింది.

దీంతో అన్ని రహస్యాలు బట్టబయలు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు అసలు మీడియాలో రాకుండా చూడాలని రామోజీ తరపు లాయర్ కోర్టును కోరారు. మీడియా స్వేచ్చ అని ప్రచారం చేసే రామోజీరావు తన కేసులకు సంబంధించిన వార్తలను కప్పిపుచ్చే యత్నం చేశారన్నది అర్ధం అవుతుంది. ఇక్కడ రామోజీ రావు డిపాజిట్దారులకు డబ్బు తిరిగి చెల్లించారా? లేదా? అన్నది అంశం కాదు. ఆయన చట్ట విరుద్దంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అన్నది ముఖ్యం. ఈ విషయాన్ని  పదేపదే ఉండవల్లి అరుణకుమార్ వాదిస్తున్నారు. దీనిని చివరికి ఆర్బీఐ కూడా అంగీకరించింది.

చట్టవిరుద్దంగా డిపాజిట్ల సేకరణను నిర్దారించింది. దీంతో రామోజీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారయ్యేప్రమాదం ఉంది. అందుకే ఈ శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గెలిస్తే ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కేసులో చురుకుగా పాల్గొని మార్గదర్శి అక్రమాలను బహిర్గతం చేస్తారు. అది తన కంపెనీలకు మరింత ప్రమాదం కనుక ఎలాగైనా సీఎం జగన్‌ను ఓడించాలన్న తపనతో రామోజీ పూర్తిగా విలువలను వదలివేసి, ఇష్టారీతిన వార్తలు రాస్తూ తెలుగుదేశంకు బాకాలు ఊదుతున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఈ కేసును నీరుకార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ తాపత్రయం అంతా. ఇదే వీరిద్దరి మధ్య క్విడ్ ప్రోకో. చంద్రబాబుకు అధికారం కావాలి. అందుకు రామోజీరావు మీడియా తనకు ఉపయోగపడాలని కోరుకుంటారు. అలాగే చంద్రబాబు సీఎం అయితే తనే ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. తన కేసులలో కూడా ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు. 

పొరపాటున చంద్రబాబు గెలిస్తే, ఏపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా అఫిడవిట్ వేస్తే, దాని ఆధారంగా కేసుల నుంచి తప్పించుకోవచ్చన్నది ఆయన ఆలోచన కావచ్చు. ఇది క్విడ్ ప్రో కో అన్నమాట. టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో రామోజీ మరింత కక్ష కట్టి ప్రజాభిప్రాయాన్ని మార్చాలని విశ్వయత్నం చేస్తున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే సత్సంబంధాలు ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం నుంచి సమస్య రాకుండా చేసుకోవచ్చు.  కానీ, సీఎం జగన్  మాత్రం కొరుకుడు పడరు కనుక ఆయన పార్టీని ఓడించాలన్నది రామోజీ లక్ష్యం. అందుకోసం ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి, తన ప్రతిష్టనంతటిని బజారులో పెట్టి అనైతిక యుద్దం చేస్తున్నారు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement