పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం.. ఎంత నీచ రాజకీయం | Kommineni Srinivasa Rao Comment On Yanamala Letter To Central Govt | Sakshi
Sakshi News home page

పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం.. ఎంత నీచ రాజకీయం

Published Thu, Sep 8 2022 4:30 PM | Last Updated on Thu, Sep 8 2022 4:49 PM

Kommineni Srinivasa Rao Comment On Yanamala Letter To Central Govt - Sakshi

ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను  చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఇందుకు టీడీపీ బరితెగించిందంటే వారి లక్ష్యం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది.   

తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి బాగా నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు  రాయించారని అనుకోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే కాకినాడ జిల్లాలో కోన అనే ప్రాంతం వద్ద సుమారు 8500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడే   రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో డిపిఆర్ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాధమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. 

ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది ఒక నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు  తెలంగాణకు ఇవ్వకపోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఈ విషయంలో తెలంగాణ పై వివక్ష చూపిందంటూ  కేంద్రంపై మండిపడుతున్నారు.  కాని  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం కనుక తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే ఇదే టీడీపీ, ఇదే టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేది. 

యనమల దీనిని వ్యతిరేకిస్తూ లేఖ రాసినా టీడీపీ మీడియా కిక్కురు మనకుండా ఉండడాన్ని కూడా అర్దం చేసుకోవచ్చు. మరో వైపు గుజరాత్ కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఏపీలో ప్రతిపక్ష  టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో కనీసం ఇలాంటి పారిశ్రామిక పార్కులు ఇవ్వడం కొంతలో కొంత బెటర్. కాని వైసిపి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. 

అయినా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్దతిగా ఉన్నట్లు అనిపించేది.  యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అదికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతంలో పొల్యూషన్ వస్తుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వం హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక  పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే  తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అదికారంలో ఉంటే పొల్యూషన్ ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? వేరే పార్టీ అధికారంలో ఉంటే యాగి చేయాలన్నది వారి లక్ష్యమా? నిజమే..ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే వాటిని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. 

కాని అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం. ఎంత నీచ రాజకీయం, పరిశ్రమలు తీసుకురండి. కాని కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా?వద్దనుకుంటున్నారా? నిజంగానే  పొల్యూషన్ పై అంత శ్రద్ద ఉంటే, తిరుపతిలో అమర రాజా బాటరీస్ సంస్థ నుంచి  వస్తున్న కాలుష్యంపై ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంతా చిత్తశుద్ది ఉంటే, టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్ట పై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహదపడతారా? ఆ మాటకు వస్తే అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమి సేకరించి రాజదాని నిర్మాణం చేపడతారా? అప్పుడు పర్యావరణ పరిరక్షణ మాట ఏమైపోయింది? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తోందే? తమ రియల్ ఎస్టేట్ అవసరాలకోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999  ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంట గ్యాస్ కనెక్షన్ లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్  భావించింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్రలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే పిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. 

అదే కాదు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్ లో ఎవరైనా కేంద్రానికి పిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు ఇంకేముంది పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధాని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారని ప్తత్యర్ది పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ద్వజమెత్తేవారు. అదికారం కోల్పోయిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఎపిలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డుకోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడేయత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ ఎపి విద్యార్దులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు.ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వస్తే సుమారు ఏబై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పదివేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ ,ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశం కు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరితెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా?ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని గ్రూపు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి క నబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంత దుర్మార్గంగా కధనాలు ఇస్తున్ది చూస్తున్నాం.  నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్యకారక పరిశ్రమలపై స్పష్టమైన విదానం ప్రకటించారు. కాలుష్యం అనుమతించే ప్రసక్తి లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామని అన్నారు. 

అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మద్య ఒక కర్మాగారం పొల్యూషన్ ను జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంబోత్సవానికి ఆయన హాజరయ్యరు. ఈ విషయాలు యనమల , చంద్రబాబు వంటివారికి తెలియవని కావు.కాని తమను ఓడించిన ఎపి ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు.ఒక వేళ ఎపి ప్రబుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది? పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది.

ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలకు పాల్పడుతోంది. ప్రభుత్వంపై విద్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి.తాజాగా ఎపికి సమారు లక్షా పతికవేల కోట్ల పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని అడ్డుకోకుండా టీడీపీ వ్యవహరిస్తే మంచిదని చెప్పాలి.   రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను అభినందించాలి. చంద్రబాబు,యనమల వంటివారిని ,దుష్టచతుష్టయంలో భాగంగా ఉన్న మీడియాను ఎదుర్కుంటూ దైర్యంగా ముందుకు సాగుతున్నారు.  ఎన్న్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారు.


 


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement