AP: ‘బల్క్‌’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు | TDP Letter To Central Government Not To Set Up Bulk Drug Park In AP | Sakshi
Sakshi News home page

AP: ‘బల్క్‌’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు

Published Fri, Sep 2 2022 9:50 AM | Last Updated on Sat, Sep 3 2022 8:50 AM

TDP Letter To Central Government Not To Set Up Bulk Drug Park In AP - Sakshi

మరీ ఇంత దిక్కుమాలిన రాజకీయాలా? పొరుగు రాష్ట్రం తెలంగాణ.. బల్‌్కడ్రగ్‌ పార్కు తమకివ్వకపోవటం అన్యాయమంటోంది. వివక్ష చూపిందంటూ కేంద్రాన్ని నిందిస్తోంది. ఇక స్వరాష్ట్రం గుజరాత్‌పై ప్రత్యేక అభిమానంతో ప్రధాని దీన్ని కేటాయించారంటూ ప్రశంసాపూర్వక నిందలు కొన్ని పక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అలాంటి పార్కు ఏపీకి వస్తే.. ఇక్కడి ప్రతిపక్షం మాత్రం ఇక్కడ పెట్టవద్దంటోంది.

దీన్ని నిలిపేయాలంటూ లేఖలపై లేఖలు రాసి... రాద్ధాంతానికి రెడీ అంటోంది. రాష్ట్రానికి పారి శ్రామికవేత్తలు రావటం లేదని విమర్శలు చేసేదీ వీరే!! అభివృద్ధి లేదనే ఆరోపణలూ వీరివే. తీరా భారీ ఎత్తున ఉపాధి కల్పించే బల్క్‌ డ్రగ్‌ పార్కును సాధిస్తే.. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నదీ వీరే!! ఇదీ ఇక్కడి ప్రతిపక్ష టీడీపీ.. దాంతో అంటకాగుతున్న మీడియా తీరు.

సాక్షి, అమరావతి: చేతనైతే ఊరికి ఉపకారం చేయాలి.. అపకారం మాత్రం తలపెట్టకూడదు! మాజీ మంత్రి యనమల మాత్రం పురిటిగడ్డకే ద్రోహం తలపెడుతున్నారు! వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు అడ్డుపుల్లలు వేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్టుకుంటున్న విపక్ష టీడీపీ క్షుద్ర రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఔషధాల దిగుమతి తగ్గించుకొని ఫార్మా రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

తీవ్ర పోటీ నెలకొన్న ఈ పార్క్‌ల కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎంపికయ్యాయి. 16 రాష్ట్రాలతో పోటీ పడి మరీ మన రాష్ట్రం దీన్ని సాధించుకుంటే ఆంధ్రపదేశ్‌కు రాకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ మూడు నెలల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడైంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల మందికి ఉపాధి కల్పించే ప్రతిష్టాత్మక పార్క్‌ను రాష్ట్రానికి రాకుండా నిరోధించేందుకు టీడీపీ పన్నిన కుట్రలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి, ఎన్జీటీకి రాసిన లేఖల ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ఆపాలంటూ యనమల లేఖలు
కాకినాడ సమీపంలో ఫార్మా రంగ పరిశ్రమల ఏర్పాటుతో రైతులు, మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బల్క్‌ డ్రగ్‌ పార్కు వల్ల తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీన్ని రద్దు చేయాలంటూ తాజాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాసిన లేఖలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవే అంశాలను గత జూలై 16న లేఖ ద్వారా ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్, చెన్నైలోని ఎన్జీటీ సదరన్‌ జోనల్‌ కార్యాలయానికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో ఫార్మా పరిశ్రమల ఏర్పాటును నిలిపివేయాలని కోరారు.
చదవండి: ‘కాకినాడ’లో.. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

అక్కడ స్వాగతం.. ఇక్కడ దుర్బుద్ధి
తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బల్క్‌ డ్రగ్‌ పార్కును దక్కించుకుంది. దీంతో ఈ పార్కును రద్దు చేయాలంటూ యనమల మరోసారి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాయడం టీడీపీ దుర్బుద్ధిని బయటపెట్టిందంటూ ఫార్మా నిపుణులు, పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. ఒకపక్క ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి బల్క్‌ డ్రగ్‌ పార్కు కేటాయించడాన్ని రాజకీయాలకు అతీతంగా అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ స్వాగతిస్తూ భారీ ప్రకటనలు జారీ చేయగా మన రాష్ట్రంలో మాత్రం ఆ పార్కునే రద్దు చేయాలంటూ టీడీపీ పదేపదే లేఖలు రాయడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తుంటాయని, ఇక్కడ టీడీపీ మాత్రం ప్రతిష్టాత్మక బల్క్‌ డ్రగ్‌ పార్కును మన రాష్ట్రం దక్కించుకుంటే అభినందనలు తెలపకపోగా రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయడం దారుణమని ఫార్మా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ రూ.వేల కోట్ల పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్రలపై మండిపడుతున్నారు.

యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతించిన కంపెనీలే..
ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, అందుకే బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్నామంటూ యనమల పేర్కొనటంపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు విరుచుకుపడుతున్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ అంటే ఏమిటి? అక్కడ వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై కనీస అవగాహన లేకుండా దుగ్ధతో లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న కంపెనీలు మాత్రమే బల్క్‌ డ్రగ్‌ పార్కులో ఏర్పాటవుతాయని, ఒక్క చుక్క వ్యర్థం బయటకు వచ్చినా వాటి అనుమతులే రద్దు అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్లే ఈ విషయంలో ఫార్మా కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయని ఫార్మా రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

కట్టుదిట్టంగా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ 
బల్క్‌ డ్రగ్‌ పార్కులో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి వచ్చే ఘన, ద్రవవ్యర్థాలను శుద్ధిచేసేందుకు ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేస్తారు కాబట్టి వ్యర్థాలు బయటకువెళ్లే అవకాశం ఉండదని నిపుణులు పే ర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలున్న హైదరాబాద్‌లో లేని కాలుష్యం కాకినాడకు ఎక్కడి నుంచి వస్తుందంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క రాష్ట్రానికి పరిశ్ర మలు రావడంలేదంటూ దుష్ప్రచారం చేస్తూ మరోపక్క దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే బల్క్‌డ్రగ్‌ పార్కును ఎందు కు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కుకు అడ్డుపడటం ద్వారా తుని నియోజకవర్గంలో యువతకు ఉపాధి దొరకకుండా యనమల వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

గుజరాత్‌లో స్వాగతిస్తారు
రాష్ట్రానికి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ రావడం స్వాగతించాల్సిన విషయం. ఇప్పుడు నూతన టెక్నాలజీ ద్వారా పరిశ్రమల వ్యర్థాలను 99 శాతం రీ సైకిల్‌ చేస్తున్నారు. వ్యర్థాల నియంత్రణకు జీరో లిక్విడ్‌ డిజార్డ్‌ (జెడ్‌ఎల్‌డీ) విధానం అందుబాటులో ఉంది. సముద్రంలో 35 వేల పీపీఎం సాల్ట్‌ ఉంటుంది. దాన్ని రివర్స్‌ ఆస్మాసిస్‌ ద్వారా 3 పీపీఎంకి తగ్గిస్తున్నామంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఉన్న అసలైన పొల్యూషన్‌ పేదరికం, నిరుద్యోగం లాంటివి పోగొట్టాలంటే పరిశ్రమలను పెంచాల్సిందే. గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు వస్తే స్వాగతిస్తారు. 
– ప్రొఫెసర్‌ మురళీకృష్ణ, జేఎన్‌టీయూకే, సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ మాజీ సభ్యుడు

ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ
బల్క్‌ డ్రగ్‌ పార్కులో ఏర్పాటయ్యే ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఉమ్మడి వ్యర్థ నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. దీంతో ఫార్మా కంపెనీలు సొంతంగా వ్యర్థ నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువ రేటుకే వ్యర్థాల శుద్ధి అందుబాటులోకి తేవడం కంపెనీలకు కలిసొచ్చే అంశం.
– ఈశ్వర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌

ఎఫ్‌డీఏ అనుమతులున్నవే
దేశంలో ఏర్పాటయ్యే బహుళజాతి ఫార్మా కంపెనీలు యూఎస్‌ ఎఫ్‌డీఏ నిబంధనలను  తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మన దేశ నిబంధనలతో పోలిస్తే ఇవి చాలా కఠినంగా ఉంటాయి. యూఎస్‌ ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ కంపెనీలు ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి. ఈ విషయం తెలుసుకోకుండా ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందంటూ యనమల నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
– లంకా శ్రీధర్, రాష్ట్ర పెట్టుబడుల సలహాదారు

యువతకు ఉపాధి
తీర ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
– గంగిరి నాగేంద్ర, కొత్త పెరుమాళ్లపురం, తొండంగి మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement