రేవంత్‌ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్‌తో మోసం చేసినట్లా? | Kommineni Srinivasa Rao Strong Counter to CM Revanth Reddy Cheating farmers | Sakshi
Sakshi News home page

రేవంత్‌ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్‌తో మోసం చేసినట్లా?

Published Wed, May 22 2024 12:24 PM | Last Updated on Wed, May 22 2024 1:19 PM

Kommineni Srinivasa Rao Strong Counter to CM Revanth Reddy Cheating farmers

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో  కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన  మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. 

మంత్రివర్గం ఈ  హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు.  కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా  కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై  శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా  రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. 

ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. 

అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. 

తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..

రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే  వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. 

ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది.  దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు.  ఆగస్టు  పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి.  ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.

ఆ రోజుల్లో  పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు.  కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు.  ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. 

రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో  కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. 

కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో  జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు  ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు.  వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది.  మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500  కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల  రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. 


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement