అక్కరకురాని కోట్ల, భూమా, కేఈ కుటుంబాలు
ఆలూరు టిక్కెట్ విషయంలో సుజాతమ్మకు మొండిచేయి!
అనుచరుల నిరసనలను పట్టించుకోని చంద్రబాబు
కుటుంబానికి ఒకే టిక్కెట్ పేరిట అన్యాయం
వేమిరెడ్డి కుటుంబం కంటే కోట్ల కుటుంబం బలహీనమైందా? అనే చర్చ
టీడీపీలో రగులుతున్న అసంతృప్తి జ్వాల ప్రాధాన్యత కుటుంబాలకు రెండేసి సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్
చంద్రబాబును నమ్ముకుంటే ఇంతే..
నెల్లూరు జిల్లాలో ఇటీవల టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, ఆయన భార్య ప్రశాంతికి టిక్కెట్లు ఇచ్చారు.
► తాడిపత్రి అసెంబ్లీ టిక్కెట్ దక్కించుకున్న జేసీ కుటుంబానికి, అనంతపురం పార్లమెంట్ టిక్కెట్ కూడా ఖాయమైనట్లు తెలుస్తోంది.
► అలాగే కడప ఎమ్మెల్యే అభ్యరి్థగా రెడ్డప్పరెడ్డి గారి మాధవికి ఇచ్చారు. కడప పార్లమెంట్ కూడా మాధవి భర్త శ్రీనివాసరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది.
► ఇలా చాలా చోట్ల రెండు సీట్లు ఇచ్చినప్పుడు తమకు ఇవ్వకపోవడం చూస్తే కోట్ల కుటుంబం రాజకీయంగా అత్యంత బలహీనపడిందనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
వైఎస్ జగన్‌తోనే న్యాయం
►రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తగిన గౌరవం ఇచ్చారనే చర్చ జరుగుతోంది.
► చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చంద్రగిరి,ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చారు.
► అలాగే మేకపాటి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చారు.
► పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు.
► ఇలా ప్రాధాన్యత ఉన్న కుటుంబాలకు జగన్‌మోహన్‌రెడ్డి తగిన గౌరవం ఇస్తుంటే, టీడీపీలో మాత్రం ఈ పరిస్థితి లేదనే చర్చ నడుస్తోంది.
సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి కొనసాగుతోంది. నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని ఆమె అనుచరులు హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబు నివాసం, ఎనీ్టఆర్ ట్రస్ట్‌భవన్ వద్ద బైఠాయించి కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ పాలసీగా తీసుకుందని, దీన్ని అంతా అర్థం చేసుకుని పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాటలకు, చేతలకు ఏ మాత్రం పొంతన లేదనే విషయం కోట్ల కుటుంబంతో పాటు అనచరులకు కూడా స్పష్టమైంది.
జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాల్లో కోట్ల కుటుంబం ఒకటి. విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ప్రకాశ్‌రెడ్డి కేంద్రమంత్రిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంత వరకూ కర్నూలు జిల్లాను కోట్ల కుటుంబం శాసించింది. కాంగ్రెస్‌పార్టీలో వారు చెప్పిన వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడి 2019లో టీడీపీ తీర్థం పుచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యేగా సుజాతమ్మ ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా సూర్యప్రకాశ్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఈ ఓటముల నేపథ్యంలో పార్టీ బలం మినహా కోట్ల కుటుంబానికి వ్యక్తిగతంగా పెద్ద బలం లేదనే భావనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే పార్లమెంట్ స్థానాన్ని తప్పించి డోన్ అసెంబ్లీకి పరిమితం చేశారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ అంటూ సుజాతమ్మను తప్పించారు.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా సుజాతమ్మ
టీడీపీ ప్రకటించిన రెండు జాబితాల్లో కూడా సుజాతమ్మ పేరు లేదు. ఉమ్మడి జిల్లాలో ఆదోని, ఆలూరు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో తనకు టిక్కెట్ ఇవ్వడం లేదని సుజాతమ్మకు స్పష్టత వచ్చింది. దీంతోనే ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న గుమ్మనూరు జయరాం కూడా కోట్ల సుజాతమ్మకు టిక్కెట్ వద్దని, వీరభద్రగౌడ్‌కు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. వీరభద్ర గౌడ్‌కు ఇస్తే అతనికి ఫండ్ కూడా ఇస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
టీడీపీ శ్రేయస్సు కాకుండా తన రాజకీయ స్వార్థం కోసమే జయరాం ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. సుజాతమ్మకు టిక్కెట్ ఇస్తే గెలిచినా, ఓడినా నియోజకవర్గం ఆమె చేతిలోనే ఉంటుందని, వీరభద్రగౌడ్‌కు టిక్కెట్ ఇప్పిస్తే ఎలాగూ ఓడిపోతాడని.. అప్పుడు నియోజకవర్గం తన చేతుల్లో ఉంటుందనేది ఆయన ఆలోచనగా చర్చ జరుగుతోంది. ఆ తర్వాత భవిష్యత్తులో తమ కుటుంబానికే ఆ టిక్కెట్ ఇప్పించుకునే అవకాశం ఉంటుందని జయరాం ఎత్తుగడగా తెలుస్తోంది. మరోవైపు గౌడ్‌కు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, శివజ్యోతి, ప్రసాద్ అధిష్టానికి చెప్పినట్లు సమాచారం.
ముఖం చెల్లక..
కోట్ల కుటుంబమే కాదు.. భూమా, కేఈ కుటుంబాలకు కూడా చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే భూమా బ్రహ్మానందరెడ్డి, కేఈ ప్రభాకర్ కూడా టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీలో మొక్కుబడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, అభ్యర్థులతో పాటు తిరగలేకపోతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment