అసలే పార్టీ పాతాళం వైపు చూస్తోంది. ఈ సీటు గెలుస్తామని ఏ జిల్లాలోనూ చెప్పేంత ధీమా కనిపించడంలేదు. కానీ పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు షరా మామూలే. ఏ నియోజకవర్గంలో చూసినా పచ్చ పార్టీలో తన్నులాటలు కామన్‌గా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోనే తమ్ముళ్ళు తన్నుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో గొడవలకు కారణమేంటో చదవండి..
అనుకూలం x వ్యతిరేకం
గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం పార్టీ అంపశయ్యపైకి చేరింది. వంగల పూడి అనిత, కొత్తపల్లి జవహర్ అంటూ... నియోజకవర్గంలో నేతల్ని మారుస్తున్నా పార్టీ రాత మారడంలేదని అక్కడి కేడర్ ఆందోళన చెందుతోంది. మంత్రిగా ఉన్న కాలంలో జవహర్ రాజేసిన గ్రూపుల కుంపటి సెగలు నేటికీ చల్లార లేదు.
మొన్న అమరావతి రైతుల యాత్ర సన్నాహక సమావేశంలో కుమ్ములాడుకున్న జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు.. మరోసారి చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేశాయి. నియోజకవర్గ నాయకులు బాబు పర్యటన ఏర్పాట్ల పై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం సజావుగా సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ సమావేశానికి వచ్చారు. జవహర్ ను చూసిన వ్యతిరేకవర్గం కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్కు పని ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు దింపుడు కళ్లెం ఆశలు
చంద్రబాబు హయాంలో జవహర్ మంత్రిగా పనిచేసినపుడు ఒక వర్గాన్ని దూరంగా పెట్టారు. తనవర్గం వారిని వారిపై రెచ్చగొట్టారు. అప్పటినుంచి కొందరు నేతలు, కార్యకర్తలు జవహర్ వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జవహర్‌కు కొవ్వూరు టిక్కెట్ రాకుండా చంద్రబాబు దగ్గర చక్రం తిప్పారు వ్యతిరేక వర్గం నాయకులు. తనవారి మాట కాదనలేక.. అప్పట్లో కొత్తపల్లి జవహర్ను చంద్రబాబు నాయుడు తిరువూరు స్థానానికి పంపించారు.
పాయకరావుపేట ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ అక్కడ గ్రూప్ తగాదాల్లో కూరుకుపోయిన వంగలపూడి అనితను కొవ్వూరు నుండి పోటీ చేయించారు. ఘోర పరాజయం పాలైన వంగలపూడి అనిత ఎన్నికల అనంతరం కొవ్వూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో తిరిగి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు పలుమార్లు జవహర్ ప్రయత్నించినా వ్యతిరేకవర్గం అడ్డుపడడంతో ఆయన ఆశలు అడియాశలే అవుతున్నాయి.
చదవండి: (టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?)
గోరంట్లకు జవహర్ సెగ
ప్రస్తుతం రాజమండ్రి జిల్లా ఇన్ఛార్జిగా జవహర్ కొనసాగుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. పర్యటనకు ఇన్చార్జిగా నియమితులైన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ రావడంతో ఒక్కసారిగా.. జవహర్ గోబ్యాక్ అంటూ పై నినాదాలు మొదలయ్యాయి. దీంతో జవహర్ అనుకూల వర్గం వారు వ్యతిరేకవర్గం వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య గంట సేపు వాగ్వాదం జరిగింది.
ఘర్షణను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యం కాలేదు. నాయకులు, కార్యకర్తలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్న సమయంలో సైతం గొడవ కంటిన్యూ అవుతుండటంతో బుచ్చయ్య చౌదరి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఎన్నికకు ఏడాదిన్నర ముందే ఇలా ఉంటే.. తీరా అసలు సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ ఇద్దరు బాబులకు పట్టుకుందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment