లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు.
టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు.
అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.
జంషెడ్‌పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్‌డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment