కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి! | KSR Comment On AP Govt Illegal Arrests of Social Media Activists | Sakshi
Sakshi News home page

కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!

Published Tue, Nov 26 2024 11:11 AM | Last Updated on Tue, Nov 26 2024 1:25 PM

KSR Comment On AP Govt Illegal Arrests of  Social Media Activists

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్  మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో  ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.

వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ  చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్‌లకు  తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై  వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.

అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన‍్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు  దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.

ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే  వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్‌కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్‌కు తరలించడం, తద్వారా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే  టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న  తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారని అర్థమవుతుంది.

మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో  మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు  దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్‌బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్‌ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్‌సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.

రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన  దారుణమైన  పోస్టింగ్‌లపై పోలీసులకు  ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన  ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్‌లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్‌ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్‌సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు  వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్  కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్‌సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే  టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు  ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు  చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే  ప్రమాదం ఉంటుంది. గత టరమ్‌లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులు  ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు  హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలపై కేసులు  పెడుతున్నారట.

మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు  చేశారన్న  ఫిర్యాదులు  వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే  ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన  పనులు చేయిస్తున్నారు.  ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో  ఆరు కేసులు  నమోదు చేశారట.

వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ  పార్టీలను వేధించాలన్న  దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్‌ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు  మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement