ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అబద్దాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. అమరావతి పేరుతో అందమైన గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్య పెట్టడానికి సన్నాహాలు సాగుతున్నట్లు కనిపిస్తుంది. రాజధానికి సంబంధించి కొన్ని భవనాలు నిర్మిస్తే అభ్యంతరం లేదు. కానీ, అమరావతి అంటూ పాత పాటే పాడి ఏపీని మరోసారి ముంచుతారా? అనే సందేహం వస్తోంది. ప్రజలను ఊహలలో ముంచెత్తుతూ.. గాలి మేడలు కట్టేస్తారా? అనే భావన ఏర్పడుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన అమరావతి శ్వేతపత్రం చూస్తే అత్యధిక భాగం అసత్యాలు, అర్ద సత్యాలే కనిపిస్తాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫలానా,ఫలానా పనులు చేసి ఉంటే బాగుండేదని చెబితే మర్యాదగా ఉండేది. తాను వచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో చెప్పి ఉంటే పద్దతిగా ఉండేది. అలా కాకుండా చంద్రబాబు యధావిధిగా విధ్వంసపు భాష వాడారు. అక్రమంగా ప్రభుత్వమే నిర్మించిన ప్రజావేదికను తొలగిస్తే అది విధ్వంసమట. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చితే , వందలాది ఆ పార్టీ నేతలు, అభిమానుల ఇళ్లను టిడిపి వారు నాశనం చేస్తే, ప్రభుత్వ భవనాలను పాడు చేస్తే, చివరికి ఇండోర్ స్టేడియంను కూల్చితే, అనేకమందిపై దాడులు చేస్తే అదంతా గొప్ప నిర్మాణాత్మక కార్యక్రమమని చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు. శ్వేతపత్రం లో ఎక్కడా అమరావతిలో గత ప్రభుత్వం దర్యాప్తు చేయించిన కుంభకోణాల గురించి ప్రస్తావించకపోవడం కూడా విశేషంగానే కనిపిస్తుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని అనుకున్నారు. తప్పు లేదు. దానిని ఏ విధంగా తాను అభివృద్ది చేయదలిచింది!. అందుకు అవసరం అయ్యే వ్యయం ఎంత? ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలని భావిస్తున్నది!. గతంలో మాదిరి నవనగరాలు ఇక్కడే నిర్మిస్తామని చెబుతున్నారా?. ఏపీ ప్రజలందరి నుంచి వచ్చే పన్నుల ఆదాయం అంతా అమరావతిలోనే పెట్టి కొన్ని భవంతులు నిర్మించి ఇదే సింగపూర్ అని అనుకోండని చెబుతారా?. ఇలా అనేక సంశయాలు ప్రజలలో వస్తున్నాయి. వీటిమీద శ్వేతపత్రంలో వివరణ ఇచ్చి ఉంటే ప్రజలకు క్లారిటీ వచ్చేది. కాని ఎవరికి ఏమీ అర్ధం కాని రీతిలో,అసలు ఏమీ చేస్తారో చెప్పకుండా, మాజీ సీఎం జగన్ ను తిట్టడానికే మాత్రమే ఈ శ్వేతపత్రాల తంతు నడుపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అమరావతి రాజధాని సమస్య వల్ల వచ్చింది కాదు. అలా అనుకుంటే అది భ్రమే అవుతుంది. వారి గెలుపునకు పలు ఇతర కారణాలు ఉన్నాయి. ఈవీఎంల వల్ల గెలిచారా? లేదంటే వైఎస్సార్‌సీపీ అతి విశ్వాసంతో నష్టపోయిందా? అనేదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అమరావతి అంశం ఆధారంగా కృష్ణా,గుంటూరు జిల్లాలలో ప్రజలలో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి టీడీపీ కూటమి ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఆ కారణంతోనే తాము రాష్ట్రం అంతటా గెలిచామని అనుకుని,మళ్లీ రెచ్చిపోతే నష్టం వారికే జరుగుతుంది.
2014-2019 మధ్య నడిచిన అమరావతి డ్రామా వల్ల టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అదొక్కటే కాకుండా చంద్రబాబు నాయుడు అప్పట్లో చేసిన పలు వాగ్దానాలను అమలు చేయడం లో విఫలం అవడంపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. సరిగ్గా ఇప్పుడు కూడా టీడీపీ కూటమి అదే బాటలో వెళ్లే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. అన్ని అబద్దపు వాగ్దానాలు చేశారు. వాటిని నెరవేర్చితే గొప్ప విషయమే. కాని అందుకు బహుశా రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ అవసరం అవుతుంది. ఇప్పటికే ఒక హామీ అమలుకు ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఈ సంగతి పక్కనబెడితే.. అమరావతి కోసం గతంలోనే వేల కోట్ల అప్పులు చేశారు. అయినా అది ఒకరూపానికి రాలేదు. తాత్కాలిక ప్రాతిపదికన అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని నిర్మించారు. ఈ తరుణంలో ప్రభుత్వం మారింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఏదైనా చేద్దామని అనుకున్నా.. నిత్యం కోర్టు కేసులు వేసి అడుగు పడనివ్వలేదు. ఆయన ఈ ప్రాంతాన్ని శాసన రాజధాని చేద్దామని అనుకున్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆ నగరానికి ఒక గుర్తింపు తీసుకు రావాలని తలపోశారు. కర్నూలుకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి అక్కడ న్యాయ రాజధాని ఏర్పాటుకు సన్నద్దం అయ్యారు. టీడీపీ దీనిని గందరగోళం చేయడంలో విజయవంతం అయింది. జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఒక కొత్త అసెంబ్లీ నిర్మించి ఉంటే ఎలా ఉండేదో కాని.. ఆ అవకాశమే ఇవ్వకుండా టీడీపీ నిత్యం ఒక వర్గం ప్రజలను రెచ్చగొడుతూ వచ్చింది.
ఇక శ్వేతపత్రంలో ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే చంద్రబాబు తన ఒరిజినల్ స్టైల్ లో నిరాఘాటంగా అవాస్తవాలు చెప్పినట్లు కనిపిస్తుంది. అవేమిటో చూద్దాం.
➤ విభజన జరిగి పదేళ్లయినా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన అన్నారు. అది ఎంతవరకు కరెక్టు!. ఓటుకు నోటు కేసు లో ఇరుక్కునే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉంటుందని ఆయన చెప్పేవారా?లేదా?దానిని వదలుకుని ఎందుకు విజయవాడకు వెళ్లారు. ఆ తర్వాత రాజధాని పేరుతో ఎన్ని ఊహాగానాలు చేశారు!. తత్ఫలితంగా వేలాది మంది నూజివీడు ప్రాంతంలో భూములు కొని ఎంత నష్టపోయారు!. అవేమీ శ్వేతపత్రంలో కనిపించలేదే!. రామోజీరావు కోరిక మేరకు అమరావతి పేరుతో రాజధాని ప్రకటన చేశారు కదా!
➤ సచివాలయం, అసెంబ్లీ మొదలైనవాటిని అక్కడ తాత్కాలికమైనవే అయినా నిర్మించారు కదా! ఆ తర్వాత జగన్ కూడా అక్కడ నుంచే పాలన చేశారు కదా!ఆయన అనుకున్న మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు కదా!అలాంటప్పుడు అమరావతి రాజధాని కాకుండా ఎలా పోతుంది!రాజధాని లేదని చెప్పడం పచ్చి అబద్దం అనే సంగతి రుజువు అవుతుంది.
➤ ఉపాధి కల్పించే నగరం లేక యువత వలస పోతున్నారట!. ఎంత పెద్ద నగరం ఉన్నా ఎవరి అవకాశాలను బట్టి వారు వలస వెళుతుంటారు. మరి అంత గొప్ప దార్శనికుడు అయితే ఐదు కోట్ల జనాభా ఉన్న కోస్తా, రాయలసీమలలో ఎందుకు పరిశ్రమలను చంద్రబాబు తన పద్నాలుగేళ్ల సీఎం పదవీకాలంలో తేలకపోయారు!. విశాఖ అయితే సత్వరమే ఉపాధి కేంద్రం అవుతుందనే కదా జగన్ దానికి ప్రాముఖ్యత ఇచ్చింది. పోర్టులు మొదలైనవాటిని నిర్మించడం ఆరంభించింది. సింగపూర్ కన్సార్టియం కు చంద్రబాబు వేల కోట్ల రాయితీలు ఇచ్చింది అక్కడ ఏవైనా పరిశ్రమల ఏర్పాటు కోసమా!లేక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమా?మొత్తం అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబా?కాదా?.
➤ అభివృద్ది అంటే రియల్ ఎస్టేటేనా? కృత్రిమంగా ధరలు పెరిగేలా చేసి,ఇన్ సైడ్ ట్రేడింగ్, అస్సైన్ మెంట్ భూముల కుంభకోణం వంటివాటికి అవకాశం కల్పించి అదేదో గొప్ప విషయంగా ప్రచారం చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది. యాభైవేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలాతన గత టరమ్ లో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు అన్నారు. ప్రణాళిక సరే! ఆ డబ్బు ఎందుకు సమకూర్చుకోలేకపోయారు?.
➤ 2018 నాటికే ఒక దశ నిర్మాణం అయిపోతుందని గాలి మాటలు అప్పట్లో చెప్పారా?లేదా?. మరి ఎందుకు పదిశాతం కూడా చేయలేకపోయారు?. ఏభైవేల కోట్ల వ్యయం చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇరవైవేల కోట్ల నుంచి ముప్పైవేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదట. ఎవరి చెవిలో పువ్వు పెట్టడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు!
➤ రాజధానిలో ఏర్పాటైన రెండు యూనివర్శిటీలలో చదుకున్న పేద పిల్లలకు ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తున్నాయట. అసలు పిల్లలు ఎందరికి ఉద్యోగాలు వస్తాయి. అందులో ఎంతమందికి కోటి రూపాయల జీతం వస్తుంది?ఎవరిని మోసం చేస్తున్నారు!.
➤ భూమి విలువ ఎకరా ఇరవై కోట్లకు పెరిగేదని, తద్వారా లక్షాఅరవై వేల కోట్ల సంపద ప్రభుత్వానికి వచ్చేదని ఆయన కాకి లెక్కలు చెబుతున్నారు. అంటే ఇక్కడ పేద,మద్య తరగతివారెవ్వరికి జీవించే అవకాశం లేనట్లు ఒప్పుకున్నట్లే కదా!. సంపద సృష్టిం సంగతి దేవుడెరుగు!ముందుగా లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా?ఇదంతా దేనికి !ప్రైవేటు ఆసాముల భూముల విలువలు పెంచడానికే కదా!అదే ప్రభుత్వ భూమి తీసుకుని రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేసుకుంటే మహా అయితే ఐదువేల నుంచి పదివేల కోట్ల వ్యయంతో అయిపోయేవి కదా!ఆ తర్వాత ప్రైవేటు వారు తమకు కావల్సిన రీతిలో వారి భూములను అభివృద్ది చేసుకునే వారు కదా!ఆ ఖర్చంతా ప్రభుత్వానికి ఉండేది కాదు కదా!.
➤ కృష్ణా నది పరివాహంలో రాజధాని నిర్మించవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెబితే.. ఆ కమిటీ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని సిఫారస్ చేసిందని ప్రచారం చేయడం చంద్రబాబుకు తగునా?. అక్కడ భూములు భారీ భవంతుల నిర్మాణానికి తగవని,పునాదులకే చాలా వ్యయం చేయవలసి ఉంటుందని నిపుణులు చెప్పారా?..లేదా?.
➤ విశాఖలో రిషికొండలో అప్పటికే ఉన్న కొన్ని భవంతులు తొలగించి ఆధునికమైన రీతిలో భవనాలు నిర్మిస్తే.. పర్యావరణం దెబ్బతిందని దుర్మార్గపు ప్రచారం చేసినవారు అమరావతిలో మూడు పంటలు పండే ముప్పైమూడు వేల ఎకరాల భూమిని విధ్వసం చేస్తే పర్యావరణం నాశనం కాదట. పవన్ కల్యాణ్.. అమరావతి అన్నది ఒక వర్గం రాజధాని అని, రాయలసీమ,ఉత్తరాంధ్రవారికి ఇక్కడ అవకాశం ఏమి ఉంటుందని గతంలో ప్రశ్నించిన మాటేమిటి?. ఇప్పుడు ఎందుకు మాట మార్చారు?వరదలు వస్తే మునిగిపోయే ప్రదేశంలో రాజధాని నిర్మాణం చేపట్టారన్న విమర్శలకు ఈనాటికి సమాధానం దొరికిందా!. కొండవీటివాగు మళ్లింపునకు లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది!.
➤ జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు చెల్లించిన మాట వాస్తవం కాదా!అలాగే వ్యవసాయ కూలీలకు పరిహారం ఇచ్చింది నిజం కాదా!అయినా రైతులకు ఏదో అన్యాయం జరిగిందని ప్రచారం చేశారు. రైతులు తమ భూములకు గాను ప్లాట్లతో పాటు కౌలు పొందుతున్నా,వారందరిని త్యాగజీవులుగా ప్రొజెక్టు చేయడంలోని సెంటిమెంట్ రాజకీయం ఎవరికి తెలియనిది!. ఆరు లక్షల మందికి నిర్మాణ పనులలో అవకాశం వచ్చేదని చంద్రబాబు అంటున్నారు. కొంతకాలం పాటు కొన్నివేల మందికి అవకాశం ఉండవచ్చు. అది విశాఖలో అయినా ,కర్నూలులో అయినా వస్తుంది.
➤ అమరావతి గ్రామాలలో తప్ప ,చుట్టుపక్కల గుంటూరు,కృష్ణా జిల్లాలలో భూముల రేట్లు చంద్రబాబు టైమ్ లో ఎందుకు దెబ్బతిన్నాయి?ఇంత భారీగా ప్లాట్లు వేయడం వల్ల అవన్ని అమ్ముడు పోయేవరకు మిగిలిన ప్రాంతాలవారు నష్టపోవలసిందేనా?గతంలో మాదిరి నవ నగరాలు ఇక్కడే చేపడతారా?లేదా?అన్నది ఎందుకు చెప్పడం లేదు?.
తాజాగా అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా గురించి, ఆ మొత్తం ఎక్కడ నుంచి తెచ్చేది చెప్పకుండా కధలు వినిపించి జనాన్ని మభ్య పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారా?. ఇకపై ఇలాంటి ఎన్ని అబద్దాలు వినాల్సి ఉంటుందో!.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment