
సాక్షి, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో ఆ గుర్తును తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందేకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సంఘం చర్య.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్‌ను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..
Comments
Please login to add a commentAdd a comment