సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల అధికారంలో తెలంగాణలో మార్పు చేసి చూపించామని.. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న సమస్యలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు ఇచ్చారు. అలాగే.. ఏదో వేలంపాట మాదిరిగా హామీలు ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దని ప్రజల్ని ఆయన కోరారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌తో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న సమస్యలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. అప్పుడు తెలంగాణా ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అనేది గమనించాలి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు చేసి చూపించాం. అనేక మోడల్స్ ఉన్నప్పటికీ.. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణనే అనుసరిస్తోంది. రాష్ట్ర జీఎస్‌డీపీ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 3వ స్థానంలో ఉంది. వ్యాక్సిన్‌లకు ప్రపంచ రాజధానిగా తెలంగాణ మారిపోయింది. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఐటీలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది’’.. అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
..మూడో సారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేసింది చెప్పి ఓట్లు అడుగుతున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారో.. ఏం చేశారో చెప్పకుండా ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ తొమ్మిదిన్నరెళ్ళలో తెలంగాణ కు అన్యాయం చేసింది. మతాల పేరిట, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తిన్న, గడ్డం పెంచుకున్నా, జై శ్రీరామ్ అనకున్న ఇష్టానుసారంగా భౌతిక దాడులు చేస్తున్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంది. కాంగ్రెస్ చేసిన పాపాలకు 58 ఏళ్లు తెలంగాణ బాధపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేయడంతోనే వందల మంది యువకుల ప్రాణాలు కోల్పోయారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది’’.. అన్నారు. కాంగ్రెస్‌కు నా ఛాలెంజ్. ఒకే బస్సులో కర్ణాటక వెళ్దాం. అక్కడి రైతులకు కరెంట్ ఇస్తున్నారో లేదో అడుగుదాం అని అన్నారాయన.
.. కరోనా తర్వాత దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందన్న కేటీఆర్.. అత్యంత పేదల దేశంగా భారత్ మారిందన్నారు. అయితే.. ఆర్ధిక వృద్ది రేటులో తెలంగాణ 5స్థానంలో ఉందని గుర్తు చేశారు.
‘‘మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల మీద, కరెంట్ మీద మాత్రమే సీఎం కేసీఆర్ ఖర్చు పెట్టారు. అదే కర్ణాటకలో చూసుకుంటే.. రైతులు కరెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘ఉద్యోగాల విషయంలో వృద్ది సాధించాం. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల 20 వేల ఉద్యోగాలకుగానూ.. లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. 2014 నుంచి ఇప్పటిదాకా లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో ఇంతకంటే వేగంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం ఏదీ లేదు’’ అని కేటీఆర్ ప్రకటించుకున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు వేలంపాట మాదిరిగా హామీలు ఇస్తున్నాయని, మేం(బీఆర్‌ఎస్) మాత్రం చేసిన అభివృద్ధిని చూపించి అధికారం అడుగుతున్నామని మరోమారు కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి.. మళ్లీ మాకు అధికారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు కేటీఆర్.
Comments
Please login to add a commentAdd a comment