సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ ఇళ్లు కడాతామంటే ఓట్లు వేశారు కానీ.. కూలగొట్టడానికి కాదంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు పైసలు లేవు కానీ.. మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బతుకమ్మ పండుగకు చీరలు రావు. పండుగను పండుగ మాదిరిగా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు వద్ద నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు కమీషన్లు కొట్టేయాలని చూస్తున్నారు. పథకాలు అమలు చేస్తే.. కమీషన్ రాదు.. అందుకే మూసీ అంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు. మూసీ కంపు అంతా సీఎం రేవంత్ నోట్లోనే ఉంది. తప్పు చేయనప్పుడు భయపడేది లేదు. త్వరలోనే రేవంత్ మీద కూడా పరువు నష్టం దావా వేస్తాను. ఇప్పటికే మంత్రి మీద కేసు వేశాను. మోదీకే భయపడలేదు.. చిట్టి నాయుడుకి భయపడతామా?.
నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ రెడ్డికుంటలో ఉన్న నీ ఇల్లు కూల్చు. పైసల పిచ్చి ఉంటే.. నాలుగు కోట్ల మంది చందాలు వసూలు చేసి రేవంత్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీకి కప్పం కట్టడానికి.. కుర్చీ కాపాడుకోవడానికి చందాలు వేసి ఇద్దాం.. కానీ పేద ప్రజల దగ్గరకు మాత్రం రావద్దు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడితే కనీసం కనికరం లేదు. సామాన్యులను తప్పించుకొని ఎక్కువ రోజులు పాలన చేయలేరు. కందుకూరు రైతు ధర్నా స్ఫూర్తితో ప్రతీ పల్లెలో ఆందోళనకు సిద్ధం కావాలి.
ముచ్చర్ల కేంద్రంగా రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్రదర్స్ సిటీ. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చడానికి మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. 2015 నుంచి 2022 వరకు ఎంతో శ్రమించి ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి 14 వేల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ సేకరించింది. ఆ భూములు ఫార్మా సిటీకి తప్ప.. ఫ్యూచర్ సిటీకి వినయోగించడానికి వీలు లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిరుపేదల భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుంది. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా కడతారు?. ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అర్హులైన రైతులందరికీ వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. ఒక్కో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. కనీస మద్దతు ధరకు అదనంగా వరికి 500 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారు. పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నేతలు విస్మరించారు’ అని విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: కబ్జాల కారణంగా మూసీ మూసుకుపోతోంది: సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment