రేవంత్‌లాంటోళ్లను కేసీఆర్‌ చాలామందినే చూశారు: కేటీఆర్‌ | KTR Slams Congress For Lok Sabha Polls At Ghatkesar Meeting | Sakshi
Sakshi News home page

రేవంత్‌ లాంటి బుడ్డర్‌ ఖాన్‌లను కేసీఆర్‌ చాలామందిని చూశారు: కేటీఆర్‌

Published Fri, Feb 2 2024 3:12 PM | Last Updated on Fri, Feb 2 2024 3:49 PM

KTR Slams Congress For Lok Sabha Polls At Ghatkesar Meeting - Sakshi

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణ ముఖ్యమం‍త్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను బొందపెడతామని రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాంటి వాళ్ళను చాలా మందినే చూశామని అన్నారు.  

ఘట్‌కేసర్‌లో శుక్రవారం నిర్వహించిన మేడ్చల్‌ నియోజకవర్గ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ..  ‘‘రేవంత్‌ లాంటి బుడ్డర్‌ ఖాన్‌లను కేసీఆర్‌ ఎంతోమందని చూశారు. ఎంతోమంది తీస్మార్ ఖాన్‌లను మాయం చేసి తెలంగాణా తెచ్చారు కేసీఆర్. పార్టీ కార్యకర్తలు ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తాం. మా బాస్‌లు ఢిల్లీలో లేరు. గుజరాత్‌లోనూ లేరు. లంకె బిందెల కోసం వెతికే వారు అధికారంలోకి వచ్చారు. సెక్రటేరియట్‎లో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయి.. లంకె బిందెలు ఉండవు. లంకెబిందెల కోసం వెదికేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రతి ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతాం.’ అని కేటీఆర్‌ అన్నారు.

‘2 లక్షల అప్పు తెచ్చుకోండి. నేను మాఫీ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఎటుపోయింది. ఆడబిడ్డలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. వాటికోసం కోటి 57 లక్షల మంది ఆడబిడ్డలు వేచి చూస్తున్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారు. కడుపు కాలిన ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారు’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి చెక్‌ పెట్టాలని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేది లేదు, ఆరు గ్యారంటీలు అమలు చేసేది లేదని అన్నారు. కాంగ్రెస్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. 

మల్లారెడ్డిని ఢీ కొట్టలేరు
మేడ్చల్‌లో మల్లారెడ్డితో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు మల్లారెడ్డి అని తెలిపారు. 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌ ఎంపీలేనని.. అందుకే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. 


చదవండి: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. మర్రి జనార్దన్‌రెడ్డి రాజీనామా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement