సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభు త్వం 9 మెడికల్ కాలేజీలు ఇచ్చిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘కిషన్‌రెడ్డి గారూ.. సోదరుడిగా మిమ్ములను గౌరవిస్తున్నా. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలు ఇచ్చిందనడం పచ్చి అబద్ధం. మీలా తప్పుడు సమాచారం ఇచ్చే అభాగ్య కేంద్ర కేబినెట్ మంత్రిని నేను చూడలేదు. మీరు చెప్పిన అబద్ధాలకు కనీసం క్షమాపణ చెప్పే ధైర్యం కూడా మీకు లేదు’’అని వ్యాఖ్యానించారు.
‘‘సగం వండిన అసత్య ప్రచారానికి కొనగింపుగా ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న రీతిలో బయ్యారం సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని చెప్తున్నారు. గుజరాత్‌లోని మీ బాస్‌ల మన్ననలు పొందేందుకు అర్ధసత్యాలు, అబద్దాలు చెప్పే వారిలో మీరూ ఒకరని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో ప్రధాని మోదీ అధికారిక ప్రకటన చేయాలి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని ఇటు తెలంగాణలో, అటు ఏపీలో నెరవేర్చకపోవడం సిగ్గుచేటు’’అని కేటీఆర్ విమర్శించారు.
తప్పుడు ప్రకటనలతో తప్పుదోవ..
‘‘హైదరాబాద్‌లో ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ కేంద్రం ఏర్పాటు చేస్తోందని మీరు ఇటీవల ప్రకటించారు. కానీ మీ గుజరాత్ బాస్‌లు తమ రాష్ట్రానికి తరలించుకుపోయారు. అయినా మీ అబద్ధాన్ని సరిచేసుకోకుండా తప్పుడు ప్రకటనలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని కేటీఆర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరదల నియంత్రణకు చేపట్టిన ఎస్సార్‌డీపీ కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన ఖర్చును పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం రూ.985 కోట్లతో వరద నియంత్రణ చర్యలను చేపట్టింది. పనులు పూర్తికావొచ్చాయి. కానీ ఇది కిషన్‌రెడ్డి ప్రజలకు చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment