పై ఫొటో చూశారా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కాబోతున్నానన్న ఆలోచనతో కింజరాపు అచ్చెన్నాయుడు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మె ల్యే గౌతు శ్యామ సుందర శివాజీకి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్న దృశ్యమిది. ఈ చిత్రం చూస్తే ఆయనపై అచ్చెన్నాయుడుకు ఎంతో వినయ విధేయతలు ఉన్నాయనుకుంటారు. కానీ గౌతు శ్యామసుందర్ శివాజీ ఆశీస్సులు తీసుకున్న వారం రోజుల లోపలే ఆయన కుమార్తె శిరీషను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఊడగొట్టారు. కూన రవికుమార్‌ను పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడి పేరుతో నియమించారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఎవరికైతే నోరు ఉంటుందో వారిదే ఊరు అన్నట్లు పట్టం కడతారని, అవినీతి అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో దూకుడుగా ఉండి కేసులు ఎదుర్కొంటున్న వాళ్లకే పార్టీలో పెద్దపీట వేస్తారని చంద్రబాబు మరోసారి నిరూపించారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అచ్చెన్నాయుడి అభిప్రాయం తీసుకోకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారనుకుంటే పొరపాటే. రాష్ట్ర అధ్యక్షుడినే చేస్తానని పరోక్ష సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు.. అచ్చెన్నకు తెలియకుండా జిల్లా అధ్యక్ష పదవిని మార్చుతారని ఏ ఒక్కరూ భావించరు. అంతా అచ్చెన్నాయుడికి తెలిసే జరిగిందనేది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ముందు పొగిడి..
గౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం అంతా.. ఇంతా అంటూ పలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో కనీసం మాట మాత్రం చెప్పకుండా గౌతు శిరీషను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గౌతు కుటుంబంపై చంద్రబాబుకు ఏమాత్రం అభిమానం ఉందో తెలిసిపోతుంది. పదవి పోయిన శిరీష కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మార్చాలనుకుంటే ఒక మాట చెప్పి చేస్తే బాగుండేదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తానికి గౌతు శ్యామ సుందర శివాజీ కాళ్లకు అచ్చెన్నాయుడు మొక్కిన కొన్ని రోజులకే ఆమె కుమార్తె పదవి పోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. (అచ్చెన్నపై యూటర్న్)
టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. కూన రవికుమార్ గతంలో ఆమదాలవలస శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రభుత్వంలో విప్‌గా పనిచేశారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment