సాక్షి, చెన్నై: త్వరలో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా గల్లంతు ఖాయమని బీజేపీ నేత, నటి కుష్బూ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా, సేవా దృక్పథంతో నాలుగేళ్లు పయనించినట్టు తెలిపారు. బీజేపీలో చేరిన కుష్బూ గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదన్నారు. కొంతమంది నేతలు వారసులు అంటూ ముందుకు సాగుతున్నారే గానీ, ప్రజాహితంపై, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదన్నారు. తానేదో ఆదాయాన్ని ఆర్జించి బీజేపీలో చేరినట్టు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా నాలుగేళ్లు పయనించానని పేర్కొన్నారు. (బాధతోనే అలా అన్నా.. క్షమించండి)
ఈ నాలుగేళ్లు సమయం, శ్రమను వృథా చేసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా బలోపేతం నినాదంతోనే తన పయనం ఉంటుందన్నారు. తన రాజకీయ వ్యవహారాల్లో భర్త సుందర్ సీ ఎప్పుడూ జోక్యంచేసుకోలేదన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే బీజేపీలో చేరినట్టు తెలిపారు. కన్యాకుమారి నుంచి తాను పోటీ అనేది ప్రచారం మాత్రమే అని, అక్కడ బీజేపీకి బలమైన నేతగా పొన్‌రాధాకృష్ణన్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment