పెరంబూరు: మరో రెండు నెలల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులవుతారని ఆ పార్టీ ప్రచార కర్త, నటి కుష్భూ పేర్కొన్నారు.ఈమె ఇటీవల ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు, గత ఏడాది డిశంబర్‌లో జాతీయ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలను చేపట్టిన రాహుల్‌గాంధీ ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. తదుపరి తమిళనాడుపై దృష్టి పెట్టనున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో పెను మార్పులు జరగనున్నాయన్నారు. మరో రెండు నెలల్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తిరునావుక్కరసన్ పని తీరు బాగాలేదా? అన్న ప్రశ్నకు ఆయన ఇంకా బాగా చేయాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్నకు అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని బదులిచ్చారు. ఆ పదవికి ఎవరెవరు పోటీ పడుతున్నారని అడగ్గా సీనియర్ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు. తమిళనాడులో కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, దానికి మిమ్మల్ని నాయకురాలిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోందే అని అడగ్గా అవి వదంతులన్నారు. ఆ బాధ్యతను సీనియర్ నాయకుడు చిదంబరం చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతుందే అని అడగ్గా చిదంబరం పార్టీలో చాలాపెద్ద నాయకుడని, ఆయన తమిళ ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి అన్నారు. అయితే ఆయన పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడానికి అంగీకరిస్తారా? అన్నది సందేహమేనన్నారు.
నేను చాలా సంతోషంగా ఉన్నా..
పార్టీలో సంతోషంగా ఉన్నారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం కాంగ్రెస్, అంతకు ముందు డీఎంకే లోనూ సంతోషంగా ఉన్నానన్నారు. ఇప్పటికీ కనిమోళి, సెల్వి అక్క తదితరులతో సత్సం బంధాలు కొనసాగిస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment