కమలం వైపు కుష్బూ చూపు | Kushboo Focus on Join BJP Conflicts With Congress Party | Sakshi
Sakshi News home page

కమలం వైపు కుష్బూ చూపు

Published Sat, Aug 1 2020 7:39 AM | Last Updated on Wed, Aug 5 2020 11:27 PM

Kushboo Focus on Join BJP Conflicts With Congress Party - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రప్రభుత్వ నూతన విద్యా విధానానికి మద్దతు పలకడం ద్వారా కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి, నటి కుష్బూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.    తమిళనాడు రాజకీయాల్లో సినీగ్లామర్‌ కొత్తేమీ కాదు. ఆనాటి ఎంజీ రామచంద్రన్‌ మొదలుకుని జయలలిత, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్‌ ఇలా ఎందరెందరో వెండితెరపైనే కాదు రాజకీయ తెరపై కూడా మెరిసారు. డీఎంకే అగ్రనేత దివంగత కరుణానిధి సైతం కథ, మాటల రచయితగా సినిమారంగంతో పెనవేసుకున్నవారే. ఇదేకోవలో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటి కుష్బూ కొన్నేళ్లపాటూ కొనసాగి అంతర్గత కారణాల వల్ల ఆ పార్టీని వీడి రాహుల్‌గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో నటుడు శివాజీగణేశన్‌ తరువాత ఇటీవలి కాలంలో కుష్బూ చేరికతోనే కాంగ్రెస్‌ పార్టీకి సినీ గ్లామర్‌ వచ్చింది. హీరోయిన్‌గా వెలిగిపోతున్న తరుణంలో ఆమెకు తమిళనాడులో ఆలయాలు కూడా కట్టించిన ఖ్యాతి ఉంది. దీంతో  పార్టీలోకి వచ్చిందే తడవుగా జాతీయ అధికార ప్రతినిధి పదవి ఆమెను వరించింది. కాంగ్రెస్‌ తమిళనాడు శాఖలో గుంపుల్లో గోవిందాలా గాక తనకంటూ ప్రత్యేకంగా, స్వతంత్రంగా వ్యవహరించారు. (కేంద్ర నిర్ణయానికి ఖుష్భూ మద్దతు)

ఈ శైలి కొందరికి నచ్చలేదు. కాంగ్రెస్‌ మహిళా విభాగ జాతీయ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా, కుష్బూకు మధ్య పొసగలేదు. నగ్మా హాజరయ్యే చెన్నైలోని కార్యక్రమాలకు కుష్బూ ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యేవారు. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మారినపుడు కుష్బూ ఏదో ఒక వర్గం వైపు నిలవక తప్పని పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో మరో వర్గానికి ఆమె కంటగింపుగా మారింది. పురుషాధిక్యత కలిగిన కాంగ్రెస్‌లో ఆత్మాభిమానం మెండుగా కలిగిన కుష్బూ పార్టీలో ఇమడలేని పరిస్థితులు చుట్టుముట్టాయి. అధిష్టానంలో రాహుల్‌గాంధీ ఆశీస్సులు ఉన్నా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్‌ పొందలేక పోటీచేయలేక పోయారు. కాంగ్రెస్, డీఎంకే కూటమిగా కొనసాగడం, గతంలో డీఎంకేతో విభేదించి కాంగ్రెస్‌లో చేరడం వల్లనే డీఎంకే ముఖ్యనేత కుష్బూకు అడ్డుతగిలినట్లు సమాచారం.

రాష్ట్రంలో సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన హామీ దక్కలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగితే ఇలా అన్నిరకాల నష్టమేనని కుష్బూ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై రాహుల్‌ అసహాయతను బహిరంగంగానే వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామాతో సచిన్‌ పైలెట్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. సచిన్‌పైలెట్‌కు కుష్బూ మద్దతు పలకడంతో రాహుల్‌వైపు నిలిచిన పార్టీలోని యువతరం అగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. 

మరోసారి కుష్బూ వ్యాఖ్యల కలకలం: ఇక తాజాగా కుష్బూ మరో బాంబు పేల్చారు. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, కుష్బూ స్వాగతిస్తూ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు మరోసారి కోపంతో భగ్గుమన్నారు. ఇందుకు కుష్బూ స్పందిస్తూ నేను అన్నింటికీ తలాడించే రోబో లేదా ఆట బొమ్మను కాదు, వాస్తవాలను వ్యక్తీకరించాను. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బిల్లులో భిన్నమైన అభిప్రాయాలు ఉండడం సహజం. నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. అభిప్రాయబేధాలు ఉండడం మంచిదే. నేను బీజేపీలో చేరుతానని కాంగ్రెస్‌లోకి కొందరు ప్రచారం చేస్తున్న ప్రచారం చూస్తే నవ్వొస్తోంది. కాంగ్రెస్‌ను వీడను.

నేను మౌనంగా ఉంటే కయ్యానికి కాలుదువ్వాలనిపిస్తుందని తన ట్విట్టర్‌ ద్వారా గట్టిగా బదులిచ్చారు. ఈ మాటలు కాంగ్రెస్‌ నేతల్లో మరింత అగ్గిరాజేసాయి. గతంలో ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ టీఎన్‌సీసీ అధ్యక్షులుగా ఉన్నపుడు పార్టీలో కుష్బూ చురుగ్గా వ్యవహరించారు. అయితే కేఎస్‌ అళగిరి అధ్యక్షులైన తరువాత ఆమెను దూరంగా పెట్టారు. అభిప్రాయ వ్యక్తీకరణకు కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉంది, అయితే అది అంతర్గతంగా జరిగే సమావేశాలకే పరిమితమని కుష్బూ వ్యాఖ్యలపై కేఎస్‌ అళగిరి పరోక్షంగా శుక్రవారం ట్వీట్‌ చేశారు. బహిరంగంగా మాట్లాడితే దాన్ని రాజకీయ అపరిపక్వత అంటారని విమర్శించారు. ఇదే అదనుగా కాంగ్రెస్‌ను వదిలి రండి అంటూ పలువురు బీజేపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా కుష్బూను ఇప్పటికే ఆహ్వానించారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమే ఆమె వైఖరికి కారణమని విశ్వసనీయ సమాచారం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement