ఎన్నికలు సమీపిస్తున్నా జనసేనాని పోటీపై కొరవడిన స్పష్టత
సాక్షి, అమరావతి: ఎన్నికలు ఓ వైపు తరుముకుని వచ్చేస్తున్నాయి. కానీ తమ పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీచేస్తారో తెలియడం లేదని పాపం జనసేన కార్యకర్తలు తెగ బాధపడిపోతున్నారు. దీనిపై ఆయన ఎటూ తేల్చడం లేదనీ... ఒకవేళ ఆయన అభ్యర్థిత్వంపైనా టీడీపీ అధినేతదే తుదినిర్ణయమేనేమో... అని గుసగుసలాడుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలలోని ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారా... లేక రెండు చోట్ల నుంచీ పోటీ చేస్తారా.. అదేమీ కాకుండా ఈసారి కొత్తగా మరో స్థానం నుంచి పోటీ చేస్తారా అన్నది అటు పవన్ కళ్యాణ్ గానీ, ఇటు పార్టీగానీ అధికారికంగా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఎన్నికల కార్యక్రమాలను ఎక్కడా మొదలు పెట్టిన దాఖలాలు లేవని ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది.
ఆ రెండింట్లో ఒక చోట నుంచేనా...
గత ఎన్నికల తరువాత ఇప్పటివరకూ ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించిన దాఖలాల్లేవని అక్కడి కార్యకర్తలు చెబుతున్నారు. ఈసారి భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలో కొంత చర్చ సాగుతున్నప్పటికీ, అక్కడ స్థానిక పార్టీ నేత గోవిందరావు ఆధ్వర్యంలో అడపాదడపా సాదాసీదా స్థాయిలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. నెలన్నర క్రితం కాకినాడ జిల్లాలో పవన్ పర్యటించి, స్థానిక నాయకులతో వార్డుల వారీగా సమీక్షలు నిర్వహించడంతో ఆయన ఈ సారి అక్కడి నుంచి పోటీ చేస్తారా అన్న అనుమానం ఉండేది. తర్వాత ఆ స్థానంపైనా ఆయన ఆసక్తి చూపించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
సమయం మించిపోతే కష్టమే...
గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. అక్కడ కేవలం 30 శాతం లోపు ఓట్లే ఆయన తెచ్చుకోగలిగారు. అంతర్గతంగా అనేక సర్వేలు చేయించుకొని... ప్రత్యేకించి కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాతో ఆ రెండు స్థానాలను చివరి నిమిషంలో ఎంపిక చేసుకున్నారు. ఈసారి ఏ నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు తెలియడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment