సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీకాంత్ కూడా ఆయనకి సహకరించారని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా వైస్రాయ్ హోటల్‌కి వచ్చేలా చేసి తర్వాత వారందరినీ తనకనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ బతికుండగానే ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆ కార్యక్రమానికి రజనీకాంత్ పూర్తిగా సహకరించారని చెప్పారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా వైస్రాయ్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి రజనీకాంత్ మద్రాసు నుంచి వచ్చి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ను నిజంగా అభిమానించి ఉంటే రజనీకాంత్.. చంద్రబాబుకు సహకరించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.
రాజకీయాలతో సంబంధం లేకపోయినా కేవలం చంద్రబాబు కోసమే అప్పటి కుట్రలో పాలుపంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తీవ్రమైన ఆవేదనలో ఉన్న ఎన్టీఆర్‌ను మరింత ఆవేదనకు గురయ్యేలా చేశారన్నారు. చంద్రబాబు దొడ్డిదారిలో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అప్పుడు ఆయనకు ఉపయోగపడిన రజనీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి పేరుతో పెనమలూరు మండలంలో నిర్వహించిన సభలో మళ్లీ చంద్రబాబుకు మద్దతు పలుకుతూ భజనచేశారని చెప్పారు. రజనీకాంత్ అప్పుడూ ఇప్పుడూ కూడా ఎన్టీఆర్ మనోభావాలను గౌరవించలేదని, ఎప్పుడూ చంద్రబాబు కోసమే పనిచేశారని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ కంటే చంద్రబాబు భజనే ఎక్కువైంది!
Comments
Please login to add a commentAdd a comment