
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వ దేవాదాయ భూమిని కాపాడాలని బీజేపీ ఆందోళన చేస్తుంటే తమ కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ధ్వజమెత్తారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కబ్జాదారులకు పోలీసులు అండగా ఉండడం దారుణమని వ్యాఖ్యానించారు. మహిళలు అని కూడా చూడకుండా బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఉప్పుగూడ ఘటనకు డీసీపీ పూర్తి బాద్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. డీసీపీని పంపింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆరోపించారు. కేసీఆర్ బయటకొచ్చి మట్లాడాలని సవాల్ విసిరారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహారించి, కబ్జాదారుకలు కొమ్ముకాస్తున్న డీసీపీపైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
అరెస్ట్ చేసిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తనను కూడా అడ్డుకున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్లిస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే డీసీపీకి ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నారని, అందుకనే ఇష్టారీతిన వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అరెస్టులకు కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని చాలెంజ్ చేశారు. కాగా, పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి బుధవారం అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment