
సాక్షి, అమరావతి: మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసిందని, దీన్ని చూసి తట్టుకోలేక టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలపై బుధవారం ఎస్‌ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, కడియపుసావరంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారన్నారు.
బుచ్చయ్యచౌదరిని ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించాలని కోరారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా బొమ్మనహళ్‌లో టీడీపీ జెండాలతో, వందలాది మందితో కలిసి ప్రచారం చేస్తున్నారన్నారు. వారు బలపరిచిన, పోటీలో ఉన్న సర్పంచి అభ్యర్థిని, వార్డు మెంబర్లను అనర్హులుగా ప్రకటించాలన్నారు. ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు పయ్యావుల శీనప్ప నామినేషన్ వేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కౌకుంట్ల పంచాయతీలోని మైలారంపల్లి, వై.రామాపురం గ్రామాల్లోని వార్డు సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధారెడ్డి, మల్లకేష్, భీమలింగ, మహేశ్, ఖాశీం తదితరులకు తగిన రక్షణ కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment