
అఖిలేశ్ మ్యాజిక్... ఎస్పీ హవా
5 సీట్ల నుంచి 37 సీట్లకు జంప్
ఇండియా కూటమి సూపర్ హిట్
బీజేపీకి కోలుకోలేని దెబ్బ...
దేశంలోనే అత్యధికంగా 80 సీట్లతో హస్తినకు రాచమార్గంగా పరిగణించే ఉత్తర ప్రదేశ్‌లో కమలానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘అబ్ కీ బార్ 400 పార్’ అంటూ ఊదరగొట్టిన కాషాయదళాన్ని ఇండియా కూటమి కకావికలం చేసింది. ఈసారి కూడా యూపీ కుంభస్థలాన్ని కొట్టి, ఢిల్లీ కోటపై తిరుగులేని పట్టు సాధించాలన్న వారి కలలకు గండి కొట్టింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సారథి అఖిలేశ్ యాదవ్ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఆశలపై నీళ్లుజల్లారు. అంతేకాదు, అట్టడుగుకు పడిపోయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు అందించి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తిరుగులేని బాట వేసుకున్నారు.
అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన కాషాయ పార్టీకి... హిందుత్వ నినాదం ఏమంత కలిసిరాలేదని ఈ ఎన్నికలు తేల్చేశాయి. మరోపక్క, ముస్లిం, దళిత, ఓబీసీ ఓటర్లు కమలానికి ముఖం చాటేయడంతో దాదాపు సగం సీట్లను చేజార్చుకుంది.ఒకప్పుడు కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ వంటి పార్టీల కంచుకోటగా ఉన్న యూపీలో 2014లో బీజేపీ ఏకంగా 71 సీట్లను కొల్లగొట్టి పూర్తిగా పాగా వేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అయితే, 2019లో బీజేపీ బలం 62 సీట్లకు తగ్గినప్పటికీ, అత్యధిక స్థానాలను గెల్చుకుని రెండోసారి హస్తిన పీఠాన్ని చేజిక్కించుకోగలిగింది.
గత ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), అఖిలే‹Ô యాదవ్ సారథ్యంలోని ఎస్పీ కలిసి పోటీ చేయడం బీజేపీ బలాన్ని కాస్త తగ్గించగలిగినప్పటికీ... పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మరోపక్క, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి చేతులు కాల్చుకుంది. కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ ఓట్ల చీలిక కాషాయ పార్టీకి వరంగా మారడంతో పెద్ద సమస్య కాలేదు. కానీ ఈసారి ఇండియా కూటమి కింద పోటీ చేసిన ఎస్పీ–కాంగ్రెస్ సత్తా చాటాయి. వీటికి టీఎంసీ, ఆప్ దన్నుగా నిలిచాయి.
ఎన్డీయే కూటమిలో ఉన్న ఆర్‌ఎల్డీకి రెండు సీట్లిచ్చి మిగతా 78 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ... ఈసారి కనీసం 65–70 స్థానాలను కొల్లగొట్టి, మోదీ 3.0 సర్కారులో తిరుగులేని మెజారిటీ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చాలావరకు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఇదే అంచనా వేశాయి. అయితే, ఇవన్నీ పటాపంచలైపోయాయి. ఊహించని విధంగా కాషాయ పార్టీ ఖాతా నుంచి 29 సీట్లు ఎగిరిపోయాయి. కేవలం 33 సీట్లకు పడిపోవడంతో బీజేపీ సొంతంగా మెజారిటీ (272 సీట్లు) మార్కుకు ఆమడదూరంలో నిలిచిపోవాల్సి వచ్చింది. మరోపక్క, గత ఎన్నికల్లో కేవలం 5 సీట్లకు పరిమితమైన ఎస్పీ ఏకంగా 37 స్థానాలను కొల్లగొట్టి దేశంలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా, రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలిచింది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎస్పీ 62 సీట్లలో, కాంగ్రెస్ 17 చోట్ల, టీఎంసీ 1 చోట పోటీ చేశాయి. కాంగ్రెస్ కూడా బలం పుంజుకుని 6 చోట్ల గెల్చింది.
కలిసొచ్చిన ‘పీడీఏ’ నినాదం...
ఎన్నికలకు ముందు అఖిలే‹శ్ యాదవ్ పిచ్డే, దళిత్, అల్పసంఖ్యాక్ – పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) నినాదంతో చేపట్టిన యాత్ర ఈ ఎన్నికల్లో కూటమి హవాకు దన్నుగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ యాత్ర ప్రధానంగా యూపీలోని ముస్లిం కేంద్రక జిల్లాల్లోనే సాగింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పాటు ఎస్పీ–కాంగ్రెస్ జట్టుకట్టడం కూడా కలిసొచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్
ఫలించని అయోధ్య బ్రహ్మాస్త్రం...
ఎన్నికలకు ముందు హడావుడిగా అయోధ్య రామ మందిరాన్ని ప్రజలకు అంకితం చేసిన బీజేపీ, దీన్ని ఈసారి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది. హిందూ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్న కాషాయ పాచిక పారలేదు. అయోధ్య కొలువుదీరిన యూపీలో పార్టీ రెండో స్థానానికి పడిపోవడం దీనికి నిదర్శనం. అంతేకాదు, అయోధ్య అసెంబ్లీ స్థానం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గాన్ని సైతం కమలనాథులు కోల్పోయారు. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్‌పై దాదాపు 65,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం.
ఇక్కడ గత ఎన్నికల్లో లల్లూ సింగ్ లక్ష ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. అంతేకాదు, మరోసారి వారణాసి నుంచి పోటీకి దిగిన మోదీ... కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలుపొందడం ద్వారా యూపీ గెలుపును చాటిచెప్పాలనుకున్నారు. ఇది కూడా నెరవేరకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 4,79,505 ఓట్ల మోజారిటీ సాధించిన మోదీకి ఈసారి గట్టి షాకే తగిలింది. మెజారిటీ 1,52,513కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment