దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల షెడ్యూల్‌లో బిహార్ రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 40 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా 40 రోజులకు పైగా ఎన్నికలు జరగున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
దశలు | నియోజకవర్గాలు |
దశ 1 (ఏప్రిల్ 19) | ఔరంగాబాద్, గయా, నవాడా, జముయి |
దశ 2 (ఏప్రిల్ 26) | కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా |
దశ 3 (మే 7) | ఝంఝర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా |
దశ 4 (మే 13) | దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ |
దశ 5 (మే 20) | సీతామర్హి, మధుబని, ముజఫర్‌పూర్, సరన్, హాజీపూర్ |
దశ 6 (మే 25) | వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వీ చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహారాజ్‌గంజ్ |
దశ 7 (జూన్ 1) | నలంద, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారం, కరకట్, జహనాబాద్ |
2019లోనూ..
2019లో కూడా బిహార్‌లో ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి.
జేడీ‘యూ-టర్న్’
నితీష్ కుమార్ మరో యూ-టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలపడంతో బిహార్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలపై చాలా ఉత్కంఠ నెలకొంది. 40 సీట్లతో బిహార్ దేశంలో అత్యంత కీలకమైన హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ రాజకీయంగా ముఖ్యమైనది.
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో మళ్లీ పొత్తు కుదుర్చుకోవడంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన గత ఎన్నికల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తోంది. బీహార్ మాజీ సీఎం లాలూ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్‌జేడీతో పాటు కాంగ్రెస్ నుంచి గట్టి సవాల్ ఎదుర్కోనుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లు గెలుచుకోగా, జేడీయూ 16 సీట్లు గెలుచుకుంది. రెండు పార్టీలు కూటమిగా ఆ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ సీనియర్ మిత్రపక్షంగా జేడీయూ అవతరించింది. ఎన్డీయేలో భాగమైన ఎల్‌జేపీ 6 సీట్లు గెలుచుకుంది. మహాఘటబంధన్‌లో భాగమైన కాంగ్రెస్ బిహార్‌లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించింది. 23.58 శాతం ఓట్ షేర్‌తో అత్యధిక ఓట్లను కూడా బీజేపీ కైవసం చేసుకుంది.
ఆసక్తికరంగా ఈసారి నితీష్ కుమార్ పార్టీతో పొత్తుతో బీజేపీ బరిలోకి దిగుతోంది. భారతీయ జనతా పార్టీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా జేడీయూ 16 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. మిగిలిన 7 నియోజకవర్గాల్లో ఎల్‌జేపీ, ఇతర మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment