దేశ రాజధాని ఢిల్లీ జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువు. జాతీయ పార్టీలతోపాటు స్థానిక ప్రాంతీయ పార్టీలు సైతం ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఢిల్లీ ప్రాంతంలో న్యూ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్, దక్షిణ ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ అనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
రెండు సార్లు క్లీన్‌స్వీప్
2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 56.6 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 22.5 శాతం, ఆప్ 18.1 శాతం, బీఎస్‌పీ 1.1 శాతం ఓట్లు పొందాయి. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికలలో కూడా కాషాయ పార్టీ దేశ రాజధానిలోని మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంది.
ఆప్, కాంగ్రెస్ సీట్ల పంపకం
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఒప్పందం చేసుకుంది . ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు దేశ రాజధానిలో 4:3 సీట్ల షేరింగ్ ఫార్ములాకు అంగీకరించాయి. ఇందులో ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది.
న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని, చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తూర్పు ఢిల్లీకి కుల్దీప్ కుమార్, న్యూఢిల్లీకి సోమనాథ్ భారతి, దక్షిణ ఢిల్లీకి సహిరామ్ పెహల్వాన్, పశ్చిమ ఢిల్లీకి మహాబల్ మిశ్రాను నామినేట్ చేసింది.
బీజేపీ ఒంటరిగా..
ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేయనుంది. రాబోయే ఎన్నికల కోసం బీజేపీ తాజాగా ఢిల్లీ నుంచి ఐదుగురి పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిధూరి, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్‌జీత్ సెహ్రావత్‌లను కాషాయ పార్టీ పోటీకి దింపింది.
ఈ ఐదు సీట్లలో మనోజ్ తివారీకి మాత్రమే రెండోసారి టికెట్ దక్కింది. కాగా రాబోయే లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేయడానికి ముందే తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనను తప్పించాల్సిందిగా పార్టీ నాయకత్వాన్ని కోరారు.
గట్టి పోటీ ఉండే కీలక స్థానాలు
న్యూఢిల్లీ హై ప్రొఫైల్ సీటు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి అరంగేట్రం చేయనున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే, న్యాయవాది అయిన ఆప్‌కి చెందిన సోమనాథ్ భారతిపై పోటీకి దిగుతున్నారు.
పశ్చిమ ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ లోక్‌సభ ఎంపీ మహాబల్ మిశ్రా.. దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్ కమల్జీత్ సెహ్రావత్‌పై పోటీ పడనున్నారు. ఇక దక్షిణ ఢిల్లీ విషయానికొస్తే, బీజేపీకి చెందిన రాంవీర్ సింగ్ బిధూరి.. తుగ్లకాబాద్ ఎమ్మెల్యే, కౌన్సిలర్ సాహిరామ్ పెహల్వాన్‌పై పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment