మంగళగిరి నియోజకవర్గంలో రెండోసారి ఓడిపోయేందుకు నారా లోకేశం రెడీ అవుతున్నారు. వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్‌ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేసి చెబుతున్నారు. మంగళగిరి పార్టీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను వైఎస్ జగన్ నియమించారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మంగళగిరి ముఖం చూడని లోకేష్ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఎన్నికలు ప్రకటించకముందే లోకేష్ ఓటమి ఎందుకు కన్‌ఫర్మ్ అయిపోయింది?
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి ఓడిపోవడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యను పార్టీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. మంగళగిరి రాజకీయాల్లో రెండు ముఖ్యమైన కుటుంబాలకు వారసురాలైన లావణ్య విజయం ఖాయం అయిపోయిందని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. లావణ్య తల్లి కాండ్రు కమల, మామయ్య మురుగుడు హనుమంతరావులు గతంలో మంగళగిరి ఎమ్మెల్మేలుగా గెలిచినవారే.
మురుగుడు హనుమంతరావు దివంగత నేత వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. హనుమంతరావు, కమల ఇద్దరూ కూడా మంగళగిరి మున్సిపల్ చైర్ పర్సన్స్‌గా కూడా పనిచేశారు. దీంతో వీరిద్దరికి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ, మంగళగిరి పట్టణంలోనూ పూర్తి స్థాయిలో పట్టు ఉంది. పైగా నియోజకవర్గం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణమైంది. రెండుసార్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంగళగిరిని మున్సిపాలిటీ స్థాయి నుంచి తాడేపల్లితో కలిపి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడంలో ఆళ్ల కీలకపాత్ర పోషించారు.
మంగళగిరిలో చేనేత సామాజికవర్గం బలంగా ఉండటంలో ఈసారి బీసీకి ఇక్కడి సీటు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ నిర్ణయించారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష వరకు చేనేత వర్గం ఓట్లు ఉన్నట్లు అంచనా. ఈ విషయం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి తెలియచేశారు. వైఎస్ జగన్ నిర్ణయంతో కొంత మనస్తాపానికి గురైన ఆళ్ల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా సమర్పించారు. కేవలం వ్యక్తిగత కారణాలవల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజులకే ఆయన పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి వైఎస్ జగన్ చెంతకు వచ్చేశారు. మంగళగిరి సీటులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని ప్రకటించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.
ఇదిలా ఉంటే గత డిసెంబర్‌లో మంగళగిరి సమన్వయకర్తగా ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవిని నియమించారు. కాని చిరంజీవి కంటే మురుగుడు లావణ్య అభ్యర్థిత్వం బెటర్ అని తేలడంతో ఆయనకు నచ్చచెప్పి లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు. నారా లోకేష్‌ను ఓడించి లావణ్యను గెలిపించి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రకటించారు. నారా లోకేష్ ఇక మంగళగిరి నుంచి సామాన్లు సర్దుకుని వెళ్లిపోవచ్చంటూ సెటైర్లు పేలుతున్నాయి. రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆళ్ల ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన తర్వాత టీడీపీ నేత నారా లోకేష్ ఇటీవల వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. కోవిడ్ సమయంలో లోకేష్ భయపడి హైదరాబాద్‌కు పారిపోయారు. రెండేళ్ల పాటు అసలు మంగళగిరి రానేలేదు.
అప్పుడు, ఇప్పుడూ కూడా లోకేష్ ఏనాడూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అసంతృప్తి టీడీపీ శ్రేణుల్లో గట్టిగా ఉంది. పైగా తాను లేనపుడు మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్ని తన సామాజికవర్గ నేతలకే అప్పగించారు గాని..నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ వర్గాలను పట్టించుకోలేదు. కాని కమ్మ నేతలు ఎప్పుడూ బీసీ, ఎస్‌సీ నేతలను లెక్కచేయరని, వారు కూడా కమ్మ నేతలనే దగ్గరకు రానిస్తారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో మంగళగిరిలోని టీడీపీ కార్యకర్తల్లో లోకేష్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గం గురించి సీరియస్‌గా లేకపోవడం, బీసీ నేతలకు అందుబాటులో లేకపోవడం, ఇటీవలవరకు అసలు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకోలేకపోవడంతో మంగళగరిలోని టీడీపీ కేడర్ క్రమంగా పార్టీకి దూరం అవుతోంది. కొద్ది రోజుల క్రితమే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నట్లు టీడీపీ, జనసేన తొలి జాబితా ద్వారా వెల్లడైంది. మరోవైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం సభల ఉత్సాహంతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం నలుదిక్కులా పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారు. తాజా పరిణామాలతో ఇక నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి మానసికంగా సిద్ధం కావాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment