‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం! | Malla Reddy Says I Will Not Contest In Malkajgiri, Gives Clarity On Party Change Rumours - Sakshi
Sakshi News home page

‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!

Published Sat, Mar 9 2024 4:56 AM | Last Updated on Sat, Mar 9 2024 11:22 AM

Malla Reddy Says I Will Not Contest In Malkajgiri: Telangana - Sakshi

ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కాలేజీ కూల్చివేత నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాలు 

సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. 

ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం 

దీంతో కేటీఆర్‌తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి 

పార్టీ మారబోమని వివరణ.. మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరమూ పోటీచేయబోమని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొందరు నేతలు, ఎంపీలు.. మరో పార్టీలో చేరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌లో, నాగర్‌కర్నూల్, జహీరాబాద్‌ ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్‌ బీజేపీలో చేరారు. చేవెళ్ల నుంచి పోటీచేయబోనని సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తాజాగా మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. 

ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ కూల్చివేతతో.. 
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజనీరింగ్‌ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభు త్వం గురువారం కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో మల్కాజిగిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి మల్కాజిగిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధి లో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్‌ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత రెండు రోజుల్లో పరిణామాలు మారి పోయాయి.

మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు సీఎం రేవంత్‌ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్‌ వ్యవహరిస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోపించారు. మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని కేసీఆర్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. గురు వారం రేవంత్‌ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలవడంపై, పార్టీ మారుతున్నట్టు జరిగిన ప్రచారంపై కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. తాను పార్టీ మార డం లేదని తెలిపారు. తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంలో కలిశామని వివరించారు. ఇదే సమయంలో తమ కు టుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా లేదని కేటీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది. 

ఆస్తులపై దాడులకు భయపడేనా? 
సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహి ంచిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీకోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ పేరును ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీచేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబసభ్యులెవరూ పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement