కాంగ్రెస్ పార్టీ ఆలిండియా అధ్యక్షుడు ఖర్గేకు కోపం వచ్చిందట. మంచిర్యాల సభకు వచ్చిన ఖర్గే టీపీసీసీ నేతలపై కన్నెర్ర చేశారు. సభ నిర్వహించిన తీరు సరిగా లేదని క్లాస్ పీకారు. ఆలిండియా నేతకు కోపం వచ్చేలా మంచిర్యాల సభలో ఏం జరిగింది? పీసీసీ నేతలు చేసిన తప్పేంటి..?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ.. నాలుగు రోజుల క్రితం మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సభలో పాల్గొన్నారు. సభకు జనం కూడా భారీ స్థాయిలో తరలివచ్చారు. అంతా భాగానే ఉన్నా సభ నిర్వహణా సమయాన్ని సరిగా సెట్ చేయకపోవడంతో.. ఖర్గేతో పాటు మిగతా ముఖ్య నేతలు మాట్లాడే సమయానికి జనం ఇంటిబాట పట్టారు. దీంతో నేతలు మాట్లాడుతున్న సమయంలో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జనంలేని సభలో ప్రసంగించిన ఖర్గేకు పీసీసీ నేతల మీద పీకల దాకా కోపం వచ్చింది.
మీటింగ్ అయిపోయేయంత వరకు సైలెంట్‌గా ఉన్న ఖర్గే.. సభ అనంతరం టీ కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకారట. పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లాస్‌తో నేతలంతా ఒక్క సారిగా సైలెంట్ అయిపోయారట. అయితే, ఖర్గే క్లాస్ తీసుకునే సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కానీ లేరట.. దీంతో అసలు వాళ్లను అనకుండా మమ్మల్ని అంటే ఏం ఉపయోగం అనుకున్నారట కొందరు నేతలు. ఖర్గే మాట్లాడే సమయానికి జనం లేకపోవడం, ఖర్గే స్పీచ్ కూడా ఆలస్యం కావడంతో ఆయనకు కోపం వచ్చింది. ప్రోగ్రామ్‌ను ఫర్‌ఫెక్ట్ గా ఎందుకు ప్లాన్ చేయలేదని ప్రశ్నించారట. మంచిర్యాల చేరుకున్న తర్వాత కూడా గంట సేపు బయట ఎందుకు వెయిట్ చేయించారని ప్రశ్నించారట. మంచిర్యాలకు రాగానే వెళ్లి ఉంటే ఇంకో గంట ముందే సభ ముగించుకునే వాళ్లం కాదా.. మనం ఆలస్యం చేసి జనం సహనానికి పరీక్ష పెట్టామని, ఇంకోసారి ఇలా జరగొద్దని సుతిమెత్తగా చురకలు అంటించారట.
కర్ణాటక ఎన్నికల బీజీ షెడ్యూల్‌లో ఇంత సమయం ఇస్తే మీరు సరిగా వాడుకోలేదని, నేను ఇక్కడకు రావడానికి ఎంతో ఖర్చు అయింది. ఇదంతా వేస్టే కదా అన్నారట ఖర్గే. దీంతో టీపీసీసీ నేతలంతా ఇదెక్కడి గొడవరా బాబు అనుకున్నారట. మొత్తానికి ఖర్గే కోపంతో తర్వాత జరిగే మీటింగ్లను ఫర్‌ఫెక్ట్ గా చేయాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఏఐసీసీ నేతలు వచ్చినప్పుడు ఎక్కువ మందితో మాట్లాడించకుండా కొద్ది మందితోనే మాట్లాడించాలని డిసైడ్ అయ్యారట. కాంగ్రెస్ అంటే డిఫరెంట్ పార్టీ. ఇవన్నీ మామూలే. శతాబ్దానికిపైగా పాతుకుపోయిన లక్షణాలు అంత త్వరగా వదులుతాయా? వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment