మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్
ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ
సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా ఇప్పటికే నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో పాటు కమిటీ సభ్యులు కేసీ వేణుగోపాల్, అంబికాసోనీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలాగే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పాల్గొననున్నారు.
8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర, జిల్లా నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభి ప్రాయాలను ఏఐసీసీ స్వీకరించింది. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు ఆశావహుల అభ్యర్థి త్వాలను పరిశీలించి తుది జాబితాను సీఈసీకి పంపింది. ప్రజల్లో బలం, కుల సమీకరణలు, పార్టీకి చేసిన సేవల ఆధారంగా అభ్యర్థుల పేర్లను నేతలు సిఫారసు చేశారు. కాగా సీఈసీ వివిధ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ తెరపైకి తీన్మార్ మల్లన్న
ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి తొలి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎ.ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నప్ప టికీ, అక్కడే బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్‌ఎస్ నుంచి వినోద్‌కుమార్ పోటీలో ఉన్న నేపథ్యంలో అక్కడ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పేరును తెరపైకి తెచ్చి నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, ఇతర రాష్ట్ర నేతలను కలిసిన మల్లన్న కరీంనగర్ నుంచి పోటీకి సానుకూలత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పేరును సీఈసీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
నిజామాబాద్ నుంచి సునీల్‌రెడ్డి, దిల్‌రాజు తదితరుల పేర్లు పరిశీలించినా, చివరి కి టి.జీవన్‌రెడ్డి వైపే నేతల మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధుకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆయనకు సీఎం వర్గం బలమైన మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇక భువనగిరి స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు కొన్ని పేర్లను ప్రతిపాదిస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం చామల కిరణ్ కుమార్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఆయనకే టిక్కెట్ దక్కేలా రేవంత్ ఇప్పటికే ఏఐసీసీ కీలక నేతలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరు పేర్లను పరిగణనలోకి తీసుకుని విజయావకాశాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. గురువారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
రేవంత్‌తో మహేశ్‌గౌడ్ భేటీ
గాంధీభవన్ వేదికగా ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు జరిగే టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఏప్రిల్ 6న తుక్కుగూడలో సభ
తుక్కుగూడలో వచ్చే నెల ఆరో తేదీన భారీ బహిరంగసభ నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనజాత ర సభకు రాహుల్, ఖర్గే లాంటి కీలక నేతలు రానుండడం, జాతీయస్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండడంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment