కోల్‌కతా: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్‌పూర్‌లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె.
ఇదిలా ఉంటే.. మంగళవారం అసన్‌సోల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పేరు ప్రస్తావించకుండానే బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై దీదీ మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీది మొత్తం తప్పుడు, ఫేక్ ప్రచారం నడిపిస్తోందంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘నేను సోషల్ నెట్‌వర్క్‌లకు అనుకూలం. నిజాలు మాట్లాడే వారి పక్షాన నేను ఉంటా. కానీ, బీజేపీ సోషల్ నెట్‌వర్క్ మొత్తం ఫేక్‌మయం. మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ సోషల్ మీడియా దిట్ట. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోనూ అబద్ధాలాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు.
మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఓ నేతను(నూపుర్‌ను ఉద్దేశించి).. కనీసం అరెస్ట్ కూడా చేయనివ్వడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది. వాళ్లు చంపితే.. ఎవరూ మాట్లాడొద్దు. అదే వేరే ఎవరైనా మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా?. జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? తీస్తా ఏం చేశారు?.. మీ దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం అంటూ మండిపడ్డారు ఆమె.
మొహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యలతో నూపుర్ శర్మ.. విమర్శలు, కేసులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి కూడా. జూన్ 20వ తేదీన ఆమె కోల్‌కతా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే దాడులు జరుగుతాయేమోననే భయంతో ఆమె బయటకు రావడం లేదు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా.. కోల్‌కతా పోలీసుల సమన్లకు మెయిల్ ద్వారా స్పందించారు ఆమె. తనకు ప్రాణ భయం ఉందంటూ నాలుగు వారాల గడువు కోరింది నూపుర్ శర్మ.
Violence and extremism are UNACCEPTABLE, no matter what!
— Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022
I STRONGLY CONDEMN what happened in Udaipur.
As law takes its own course of action, I urge everyone to maintain peace.
Comments
Please login to add a commentAdd a comment