గువాహటి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024) బీజేపీని గద్దెదించడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి రూపుదిద్దుకుంటోందని రాజోర్ దళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ అన్నారు. ప్రాంతీయ శక్తుల సమాఖ్యగా ఏర్పడి.. మమతా బెనర్జీ తమ కూటమి నేతగా ప్రజల ముగింటకు వెళతామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థపై తమకున్న విశ్వాసం, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో రాజోర్ దళ్‌ను విలీనం చేయాలని మమత కోరారని, దీనిపై తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ఆదివారం వెల్లడించారు. రాజోర్ దళ్‌ను విలీనం చేస్తే టీఎంసీ అస్సాం శాఖ అధ్యక్షుడిని చేస్తానని తనకు మమత హామీ ఇచ్చారని అఖిల్ చెప్పారు. విలీనంపై ఇప్పటికే మూడుదఫాలుగా చర్చలు జరిగాయన్నారు.
ఈ ఏడాది మార్చి– ఏప్రిల్ నెలల్లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్ గొగోయ్ శివసాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. జైల్లో ఉండి అసెంబ్లీకి ఎన్నికైన తొలి అస్సామీగా గుర్తింపు పొందారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలపై అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబరులో అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనపై మోపిన అభియోగాలను కొట్టివేయడంతో ఈ ఏడాది జూలై ఒకటో తేదీన జైలు నుంచి విడుదలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment