మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్‌ | Memantha Siddham: CM Jagan Speech At Nandyal Public Meeting | Sakshi
Sakshi News home page

మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్‌

Published Thu, Mar 28 2024 6:03 PM | Last Updated on Fri, Mar 29 2024 4:37 AM

Memantha Siddham: Cm Jagan Speech In Nandyal Public Meeting - Sakshi

సాక్షి, నంద్యాల: నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు.

మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి..
‘‘చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం జగన్‌ వివరించారు.

ఈ ఎన్నికలు మనకు జైత్రయాత్ర..
నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. ఇటు వైపు నేను ఒక్కడ్నే..అటు వైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్‌. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంతమంది తోడేళ్లు ఏకమయ్యారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడి అందించాం. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధం. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లుకూడా ముందుకు తీసుకెళ్తాం. 2 లక్షల 77వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు అండ్‌కో పని దోచుకోవడం, పంచుకోవడమే..
‘‘చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు చేశాడా?. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాన్నాడు.. చేశాడా?. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు? మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్‌కో వస్తుంది. కొత్త రంగులు, కొత్త మోసాలతో బాబు మేనిఫెస్టో ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు అండ్‌కో పని దోచుకోవడం, పంచుకోవడమే’’ అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

పేదల గుండెల్లో చోటు దక్కింది..అదే నాకు బహుమతి
58 నెలల్లో ప్రతి ఇంటి తలుపుతట్టి సంక్షేమం అందించాం. పిల్లల చదువుల గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేదు. నాడు నేడుతో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. 3వేల ప్రొసీజర్స్ చేర్చి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో 10,600 విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటు చేశాం. జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం ఆంటోంది. రైతులకోసం 10,700 ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం. చంద్రబాబు మూసేసిన డెయిరీలను తెరిపించి పాడి రైతులను ఆదుకున్నాం. పేదల గుండెల్లో నాకు చోటు దక్కింది..అదే నాకు బహుమతి. పేదల బతుకుల్లో మార్పు కోసమే నా ఆరాటం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

యుద్దానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది
‘‘చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. 2014లో చంద్రబాబు రంగురంగుల హామీల ఇచ్చారు. సూపర్ సిక్స్ అంటూ మళ్లీ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు. రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ ఒక్కరూపాయి కూడా చేయలేదు. ఆడబిడ్డ పుడితే రూ.24 వేలు ఇస్తామన్నారు..ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ప్రజలు యుద్దానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది’’ అని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement