వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతుంది. ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గేందుకు వీలు లేదు.. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.. మీరంతా కూడా సిద్ధమేనా’
అంటూ మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్ధేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు
మదనపల్లెలో కనిపిస్తున్న ప్రజాభిమానం.. జనసముద్రంలా తలపిస్తోందన్నారు సీఎం జగన్. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సముద్రంలా కనిపిస్తుందని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో ఆరు వారాల్లో జరగబోయే కురుసంగ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో గొప్ప విజయం కళ్ల ఎదుటే కనిపిస్తుందన్నారు.
మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఆరోరోజు దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో దారిపోడవునా సీఎం జగన్‌కు జనం నీరాజనాలు పలికారు. ‘మేమంతా సిద్ధం’లో భాగంగా మదనపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని.. 99 శాతం వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు
వారికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతన్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తున్నారని ప్రతిపక్ష కూటమిని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికీ లేదని దుయ్యబట్టారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడాలని అన్నారు.
30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా?
‘ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్ధి పరీక్షలకు భయపడుతాడా?. అటు వైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 99 శాతం హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారు. విలువలు, విశ్వసనీయత లేని వారు 30 పార్టీలు కలిసి వచ్చినా భయపడతామా.
మేము మంచి చేయకపోతే ఇంతమంది కలిసి మాపై పోటీ చేస్తారా?. 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేని చంద్రబాబు మా ముందు నిలబడగలరా. విపక్షాల పొత్తులు చూసి ఎవరూ భయపడటం లేదు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment