Minister Ambati Rambabu Serious Comments On Chandrababu Over SR NTR Death, Know Details Inside - Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా?’

Published Fri, Apr 28 2023 4:24 PM | Last Updated on Fri, Apr 28 2023 5:30 PM

Minister Ambati Rambabu Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: చివరి రోజుల్లో బాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోలు విడుదల చేసే దమ్ముందా? అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. సత్తెనపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరిపే నైతిక అర్హత బాబుకు లేదన్నారు. చంద్రబాబు పరమ దుర్మార్గుడని సాక్షాత్తూ ఎన్టీఆరే చెప్పారు. ఎన్టీఆర్‌ మరణానికి చంద్రబాబే కారణం అని మంత్రి అంబటి దుయ్యబట్టారు.

‘‘ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రఖ్యాత నటుడు రజనీకాంత్‌ విజయవాడ వచ్చారని తెలిసింది. ఎన్టీఆర్‌ ప్రసంగాలతో కూడిన కొన్ని పుస్తకాలను విడుదల చేయాలని వచ్చినట్లుగా విన్నాను. ఆయన రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి, రాజకీయాల కోసం రాలేదని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవంతో, సహనటుడు బాలకృష్ణ కోసం రజనీకాంత్ గారు వచ్చి ఉంటారు. ఎన్టీఆర్‌ మహానటుడు.. దానిలో ఎటువంటి సందేహం లేదు.. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం కూడా తెలుగు వారికి సంతోషకరమైన విషయమే. కానీ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరిపే హక్కు మాత్రం చంద్రబాబునాయుడికి లేదని స్పష్టంగా చెప్తున్నాను. చివరి రోజుల్లో ఎన్టీఆర్‌..  చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చాడు’’  అని మంత్రి అన్నారు.

‘‘తండ్రిలాంటి ఎన్టీఆర్‌ను గద్దె దించి, ఇబ్బంది పెట్టి అధికారంలోకి వచ్చిన పరమ దుర్మార్గుడు చంద్రబాబునాయుడు అని సాక్షాత్తు ఎన్టీ రామారావే చెప్పారు. ఎన్టీఆర్‌ చివర్లో ఎంతలా ఆవేదన చెందారో, ఎంతలా కుమిలిపోయారో దానినిబట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఆవేదనే ఆయన మరణానికి కారణమయ్యింది. దానికి సాక్షాత్తు చంద్రబాబునాయుడే కారణం. చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ గారు.. చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోలను విడుదల చేసే దమ్ము వారికి ఉందా ’’అంటూ సవాల్‌ విసిరారు.

ముసలోడివి కాక.. జగన్‌ కంటే కుర్రోడివా..?
‘‘చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంతంలో పెట్టిన మూడు మీటింగులు అట్టర్‌ ప్లాప్‌ మీటింగులే. మేడికొండూరు మీటింగు సదర్భంగా జనం రాలేదని మధ్యలో దిగి ఎస్సీ కాలనీకి వెల్లి స్థానికులకు ముచ్చట్లు చెప్పాడు. తన సభకు జనం రాలేదని వారికి ముచ్చట్లు చెప్పాడు తప్ప వారిపై ప్రేమతో మాత్రం కాదని అర్ధం చేసుకోవాలి. చంద్రబాబుకు ముసలోడు అంటే కోపం వచ్చింది. తాను ముసలోడు కాకపోతే మిట్టమధ్యాహ్నం మీటింగు పెట్టగలడా..?. రాత్రి 9-10 గంటలకు మీటింగులు పెడతాడు.. అర్థరాత్రి వరకు జనాన్ని వేధిస్తాడు. వయసు మీరిన వ్యక్తి తాను ముసలివాడిని ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నేను జగన్‌ గారి కంటే కుర్రోడ్ని అంటున్నాడు. జగన్‌ కంటే కుర్రాడివి కాలేవు చంద్రబాబూ.. నువ్వైనా, నేనైనా వృద్ధులమే.. దాన్ని అంగీకరించడానికి కూడా చంద్రబాబు సందేహిస్తున్నాడు’’ అని మంత్రి అన్నారు.

‘‘నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గంగమ్మకు రూ.6 లక్షల లబ్ధి. తురకా గంగమ్మ వద్ద నేను రూ.2 లక్షల లంచం అడిగానని చంద్రబాబు నాపై ఆరోపణ చేశాడు. నేను అలా కక్కుర్తి పడే వ్యక్తిని అవునా కాదా అనేది నా సత్తెనపల్లి ప్రజలకు, ఇక్కడి వడ్డెర కులస్థులకు తెలుసు. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన తురకా అనిల్, మరో వ్యక్తి ఒక హోటల్‌ యజమాని పిలుపు మేరకు డ్రైనేజి బాగుచేసేందుకు కూలికి తీసుకెళ్లారు. ఆ సందర్భంలో కాలువలో విష వాయువులు వచ్చాయి. వారు కేకలు పెడుతుంటే.. ఎవరైతే కూలీలను పిలిచాడో, ఆ యజమాని కందికట్ట కొండయ్య అనే వైశ్యుడు కూడా, వారిని రక్షించడానికి వెళ్ళి, దానిలో దిగి మరణించాడు.

ఈ క్రమంలో ఇద్దరు కూలీలతోపాటు, యజమాని కొండయ్య కూడా చనిపోయారు. దాంతో చనిపోయిన కూలీలకు చెందిన గంగమ్మ కుటుంబం, రోశయ్య కుటుంబం వారు, చనిపోయిన ఆ యజమాని కొండయ్య ఇంటికి వెళ్లి నష్టపరిహారంగా డబ్బులు అడిగారు. ఆ విషయాన్ని నా దృష్టికి తెస్తే... హోటల్ యజమాని కొండయ్య  కూడా చనిపోవడంతో, ఆ కుటుంబం కూడా  అదే బాధలో ఉన్నారు.. డబ్బులు అడగటం భావ్యం కాదు అని చెప్పాను. తమకు కనీసం మట్టి చేసుకోడానికి కూడా డబ్బు లేదని చెప్తే.. వారికి ఒక్కొక్కరికి రూ.2.5 లక్షలు చొప్పున ఇప్పించాను.

మానవతా దృక్ఫదంతో డబ్బు ఇప్పిస్తూ.. మీకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి డబ్బులు ఇప్పిస్తాను.. అవి వచ్చిన తర్వాత ఆ రూ. 2.5 లక్షలు తిరిగి వారికి ఇచ్చేయాలని స్పష్టంగా ఆరోజే చెప్పాను. మానవతా దృక్పదంతో, చనిపోయిన ఒక వైశ్య కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో చేశానే తప్ప ఆ డబ్బు నేను కాజేయడానికి కాదు . ఈ విషయాన్ని ఇంతకుముందుకు కూడా చెప్పాను. గంగమ్మకు ప్రభుత్వం నుంచి చెక్కు వచ్చింది. గతంలో మాట్లాడినట్లు వారికి ముందుగా రూ. 2.5 లక్షలు ఇచ్చిన వారికి, వారి డబ్బులను వారికి తిరిగి ఇచ్చేయమని చెప్పాను. గంగమ్మ మాత్రం మొత్తం డబ్బు తనకే కావాలని, ముందుగా ఇచ్చిన రూ. 2.5 లక్షలు తిరిగి ఇచ్చేది లేదని చెప్పింది. ముందు ఒప్పుకుని ఇప్పుడు అలా మాట్లాడటం కరెక్టు కాదన్నందుకు.. బయటకు వెళ్లి అంబటి రాంబాబు నన్ను రూ.2.5 లక్షలు లంచం అడిగాడని ఆరోపణలు చేసింది. ఆమెతో కచ్చితంగా పవన్‌ కళ్యాణ్‌ బ్యాచ్‌ ఆరోపణలు చేయించారు. నాపై అసత్య ఆరోపణ చేసినందుకు.. పవన్‌ కళ్యాణ్‌ రూ.4 లక్షలు, చంద్రబాబు రూ.2 లక్షలు ఇచ్చారు.

నాపై అసత్య ఆరోపణ చేసినందుకు, నా నియోజకవర్గానికి చెందిన తురకా గంగమ్మ కుటుంబం మొత్తంగా రూ.6 లక్షలు లబ్ధిపొందడం నాకు కూడా సంతోషంగా ఉంది. మరి మరో కూలీ కుటుంబానికి బాబు, పవన్ సాయం ఎందుకు చేయరు?. సత్తెనపల్లి డ్రైనేజీ ఘటనలో.. ఆ ముగ్గురు చనిపోయిన రోజు ఇదే పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఏమయ్యారు..?. ఆ రోజునే వచ్చి బాధితులు గంగమ్మ, రోశయ్య కుటుంబాలకు డబ్బులు ఇవ్వొచ్చు కదా..?. వాళ్లు నా ఓటర్లు, నా ప్రజలు..నేను స్పందించాను. నాపై ఆరోపణలు చేసిన తర్వాత మాత్రం వారికి డిమాండ్‌ పెరిగింది.

నాపై అసత్య ఆరోపణలు చేసిన వారికి కూడా డబ్బులు ఇప్పించేంత విశాల హృదయం నా దగ్గర లేదు. గంగమ్మ విషయంలో చంద్రబాబునాయుడు సెల్ఫీ దిగి, సమాధానం చెప్పాలని ఛాలెంజ్ చేశాడు. చంద్రబాబు మాదిరిగా కుళ్లు, కుతంత్రాలతో వ్యవహరించేవాడిని కాదు..  వడ్డెర మహిళ వద్ద రెండున్నర లక్షలకు కక్కుర్తి పడే నీచ స్వభావం నాది కాదు. గంగమ్మ కుటుంబానికి పవన్‌ కళ్యాణ్‌ వాళ్లే నాలుగు లక్షలు ఇస్తే.. చంద్రబాబు కేవలం రెండు లక్షలు ఇవ్వడం ఏంటి..?. పవన్‌ కళ్యాణ్‌ కంటే నీది పెద్ద పార్టీ కదా.. పది లక్షలు ఇవ్వొచ్చు కదా. నాపై కక్షతో మీరు డబ్బులు ఇస్తున్నారు తప్ప వారి మీద ప్రేమతో అయితే ఇవ్వడం లేదు.
చదవండి: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్‌ 

మొత్తం మీద నాపైన వ్యతిరేకతతో మీరు రావడం వల్ల గంగమ్మకు అదృష్టం పట్టింది. ఆరు లక్షలు వచ్చాయి. అయితే చనిపోయిన వారిలో మరో బాధితుడు రోశయ్య బిడ్డ కూడా ఉన్నాడు.. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబులు రోశయ్య కూడా సాయం చేయాలి కదా.. మరెందుకు చేయరు..?. గంగమ్మ నాపై అవాస్తవ ఆరోపణలు చేసింది కాబట్టి ఆమెకు డబ్బులు ఇచ్చారు. మరి రోశయ్య ఏం పాపం చేశాడు.. ఆయన కొడుకు కూడా చనిపోయాడు కదా. ఆయనకూ సాయం చేయాలి’’ అని మంత్రి అంబటి అన్నారు.

పేదలకు ఇచ్చిన దుకాణాలను కూలుస్తావా..?
‘‘చంద్రబాబు ఆరోపించిన శ్మశానం దూదేకుల వారి శ్మశానం..దానిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించలేదు. శ్మశానం కాంపౌండ్ వాల్ ముందు, దాతల సహకారంతో 42 దుకాణాలు కట్టించాము. వాటిని పేద వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 33 దుకాణాలు పేదలకు ఇచ్చాము. ఆ దుకాణాలపై ఎవరో ఫిర్యాదు చేశారట..చంద్రబాబు రాగానే వాటిని పడగొడతాను అంటున్నాడు. కట్టిన దుకాణాలను పడగొడతావా..? పడగొట్టు చూస్తాం. వాడెవడో నాపై ఆరోపణ చేశాడని దుకాణాలన్నీ పడగొట్టి శ్మశానం చేస్తాడట. చంద్రబాబు హయాంలో ఆ శ్మశానాన్ని బాగుచేయలేదు.
చదవండి: ఒక ముఖ్యమంత్రికి ఇంతటి స్పందన రావడం జగన్‌ విషయంలోనే..

మేము మున్సిపాలిటీ సహకారంతో దాన్ని బాగుచేసి చుట్టూ గోడ కట్టాము. దాని ముందు దాతల సహకారంతో దుకాణాల నిర్మాణాలు చేపట్టి పేదలకు ఉచితంగా ఇచ్చేశాము. దీనికి నేను శ్మశానాన్ని ఆక్రమించుకున్నాను అంటూ ఆరోపణలు చేయడం సరికాదు. టీడీపీ హయాంలో మా నియోజకవర్గంలో ఎంతో మంది పొలాలు ఆక్రమించుకున్నారు. డబ్బులు లాక్కున్నారు. .చేతనైతే, మీ పార్టీ వాళ్ళను అడిగి, అవన్నీ బాధితులకు ఇప్పించండి. పేద ప్రజలకు ఉచితంగా షాపులు ఇచ్చాం. వాళ్ల షాపులు కూలుస్తావా..?’’  అంటూ మంత్రి మండిపడ్డారు.

ఇక సర్దుకో చంద్రబాబు..
‘‘చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడకు రావడం, నాపై ఆరోపణలు చేయడం, ఆ మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రాయడం వారికి అలవాటే. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు..ఇది ఖాయం.. కుట్రలు పన్ని, హడావుడి చేయడం వల్ల లాభం లేదు. ముసలాయనకు పోయే కాలం వచ్చింది. అందుకే సర్ధుకో చంద్రన్నా.. అని సలహా ఇస్తున్నా. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపడం ఖాయం. నాపై తప్పుడు ప్రచారం చేస్తే.. నా సత్తెనపల్లి ప్రజలు సహించరు’’ అని మంత్రి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement