పేలాలు వేరుకోడానికి వచ్చావా చంద్రబాబూ..?: మంత్రి వేణు | Minister Chelluboina Venu Gopala Krishna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

పేలాలు వేరుకోడానికి వచ్చావా చంద్రబాబూ..?: మంత్రి వేణు

Published Fri, May 5 2023 7:42 PM | Last Updated on Fri, May 5 2023 7:44 PM

Minister Chelluboina Venu Gopala Krishna Comments On Chandrababu - Sakshi

సాక్షి,రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): ప్రతిపక్షనేతగా ఓదార్పునిస్తున్నావా..పేలాలు ఏరుకుంటున్నావా చంద్రబాబూ.. అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఇళ్లు కాలితే దానిపై పేలాలు వేరుకున్నట్లు చంద్రబాబు రైతులకు ఇబ్బంది వస్తే ఒక షో నిర్వహించాలని బయలుదేరాడు. రైతులకు కొంచెం ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. దీనికి ఒక షో నిర్వహించాలని చంద్రబాబు బయలుదేరడం విడ్డూరం’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.

‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచించిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు. ప్రజలు కష్టం వచ్చినప్పుడు కన్పించని వ్యక్తి.. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. తనకు అనుకూలంగా ఉన్న చానళ్లలో ప్రచారం కోసం చంద్రబాబు ఒక డ్రామా చేస్తున్నాడు. తీరా అదంతా పూర్తిగా అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. నిన్న ఉదయం నుంచి ఆయన ఈ డ్రామాను రక్తికట్టించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రామచంద్రాపురం వస్తే నీ వెనుక వచ్చిన వాళ్లు ఎంత మంది అనేది ఆత్మపరిశీలన చేసుకో.. రెండు జిల్లాల నుంచి నాయకులను రప్పించాడు. ఆయన సెక్యూరిటీ, మీడియా కలిపితే 200 మంది కూడా కన్పించలేదు’’ అని మంత్రి వేణు అన్నారు.

నష్టపోయిన రైతుకు అండగా ఉంటున్నాం:
ఏడయ్యా నీ శాసనసభ్యుడు అంటున్నావు..1వ తేదీన వర్షం వస్తే నీ నాయకుడు, కార్యకర్త ఎక్కడా కన్పించలేదు. నేను మంత్రిని...ధాన్యపు రాశుల వద్దకు వెళ్లి వెంటనే అధికారులను అప్రమత్తపరిచి ఏ రైతు ఆందోళన చెందవద్దని చెప్పాను. ముఖ్యమంత్రి గారు సమీక్షించారు..రాష్ట్రంలో పండిన ప్రతి ఒక్క గింజనూ కొనుగోలు చేస్తారు అని బరోసా ఇచ్చాను. తడిసినా, రంగు మారినా కొనే బాద్యత మాది అని స్పష్టంగా చెప్పాను. ఎడయ్యా మంత్రి.. ఎక్కడున్నాడు అంటున్నావు.. నేను తిరిగిన విషయం నా రైతులకు తెలుసు. ఇక్కడే నీ ప్లాప్‌ షో ప్రారంభం అయ్యింది. నేను కాళ్ళు పట్టుకుంటాడు అన్నావు..నేను నీలా కృతజ్ఞత హీనుడిని కాదు.
చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

నా కులంలో గొప్పవ్యక్తి చనిపోతే, నా కుటుంబంలో నష్టాన్ని భర్తీ చేసిన నా నాయకుడి వద్ద నేను వంగాను.. నీలాగా పిల్లనిచ్చి, రాజకీయ జీవితం ఇచ్చిన వ్యక్తిని రాత్రికి రాత్రి పొడిచేసిన కృతజ్ఞతాహీనుడిని కాదు. రైతుల వద్దకు వెళ్లి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఓదార్పు ఇవ్వాలి. రైతుల వద్దకు వెళ్లి ఆత్మహత్యలు అంటూ ఏకరువు పెడుతున్నావు. రైతులు సుఖంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదు. వ్యవసాయం దండగ అన్న ఒక చరిత్ర హీనుడు చంద్రబాబు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు. చంద్రబాబు నోటి నుంచే ఉచిత విద్యుత్‌ గొప్పది అని చెప్పించిన వ్యక్తి వైఎస్సార్‌.

జగన్‌ సమర్ధుడు కాబట్టే నిన్ను అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు..
జగన్‌ అసమర్ధుడు అంటున్నాడు. సమర్ధుడు కనుకే నిన్ను నీ కొడుకును అందరి కాళ్లూ పట్టిస్తున్నాడు. జగన్‌ సమర్ధుడు కనుకనే నువ్వు పవన్‌ కళ్యాణ్, రజనీకాంత్‌ కాళ్లు పట్టుకుంటున్నావు. జగన్‌ అహంకారి అంటున్నావు. ప్రజలకు సేవ చేయడానికి అతను అహంకారంతోనే పనిచేస్తారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చంద్రబాబు ఎప్పుడూ శాశ్విత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు. కావాలంటే నువ్వు వెళ్లి చూడు. పండిన పంటను ఏం చేస్తావో సాయంత్రంలోగా చెప్పు అంటూ ఘీంకరిస్తున్నాడు. ముఖ్యమంత్రి సమీక్ష చేసి ప్రతి గింజెను కొనాలనిచెప్పిన మాట వినలేదా..?

ఎకరాకు 50 బస్తాల ధాన్యం పండటానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదా..?. జూన్‌ 1న సాగునీరు విడుదల చేసింది ముఖ్యమంత్రి గారు కాదా..?. సకాలంలో సేంద్రియ ఎరువులు అందించారు.. వర్షాలను నువ్వేమన్నా ఆపేయగలవా.? వర్షం వెలిసిన తర్వాత పంట నష్టం అంచనాలు వేస్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నీకు కనీస జ్ఞానం కూడా లేదా..? గత ఏడాది వరదొస్తే ఒక్కో రైతుకు రూ.10 లక్షలకు పైగా పరిహారం వచ్చిన రైతులున్నారు. కౌలు రైతులపై నీకు ఇప్పుడు ప్రేమ పుట్టిందా..?
చదవండి: చంద్రబాబువన్నీ డ్రామాలే.. 

దరిద్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ నువ్వే చంద్రబాబు..
దరిద్రుడు అంటావా..ఏం పదం అది..ఆయన 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని మరిచావా.? నువ్వు పాలనలో ఉంటేనే దరిద్రం వస్తుంది..కరువు నీకు కేరాఫ్‌ అడ్రస్‌ నువ్వు..దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే నీ వయసు, చూపు తగ్గిపోయింది.. ట్రాక్టర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే కనిపించడం లేదు. కొనుగోలు చేస్తున్న ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు కోసం వెళ్లి ధాన్యాన్ని తొక్కి పడేశారు. ఈ ప్రభుత్వం రైతును అన్ని విధాల ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది.  మిల్లర్లు ఐపీ పెడితే మాట్లాడలేని నువ్వు ఈ రోజు దళారీలు లేకుండా కొనుగోలు చేస్తుంటే కన్పించడం లేదా..?. ఈ జిల్లాలో మునిగిన పంట 475 ఎకరాలు..34456 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మునిగింది. దాన్ని ప్రతి గింజా మేం కొనుగోలు చేస్తూనే ఉన్నాం. 

ములాఖత్‌కు వచ్చి మొసలి కన్నీరు ఎందుకు..?:
రాజమండ్రిలో టీడీపీ నాయకుడు జైలుకు వెళ్తే చంద్రబాబు ములాఖత్‌ కోసం వచ్చాడు. పనిలో పనిగా రైతులను మళ్లీ మోసం చేద్దాం..మొసలి కన్నీరు కార్చి కొంగ జపం చేద్దామని ఈ తతంగం చేస్తున్నాడు. చక్కగా ఎండి ఉన్న ధాన్యం, తడవని ధాన్యం, జగననన్న కాలనీలో ఎండబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటుంటే అక్కడకు వెళ్లి కొనుగోలు చేయడం లేదని చెప్పడానికంటే గుడ్డితనం ఉంటుందా..? నీ నాటకాలు ఎవరికి తెలియదు చంద్రబాబూ..? నువ్వు మాట్లాడితే వక్తిత్వ హననం చేయాలని బాబాయ్‌ చంపావ్‌ అంటున్నాడు. ముఖ్యమంత్రి రావాలా నీకు..? మేం నీకులాగా షో చేయలేదు. మాట్లాడితే తిత్లీ తుఫాను వచ్చింది.. నేను రాజమండ్రిలో పడుకున్నాను అంటున్నాడు.  ఈ రోజు నువ్వు చేస్తున్న తంతు వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం ఉండటం లేదు. ఏ రైతు పండించిన పంటకూ ఇబ్బంది కలుగకుండా మేం అండగా నిలుస్తున్నాం.  ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేయమని మిల్లర్లకు కూడా చెప్పాం. 

నీ హయాంలో ఏనాడైన సంచులు పంచావా..?:
ఎవడో ఒక పాత సంచి తీసుకొచ్చి ఇస్తే దాన్ని చూపించి సంచులు లేవు అంటున్నాడు. ఆయన హయాంలో ఏనాడైనా సంచులు పంపిణీ చేయలేదు. మేం చేస్తున్నట్లు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు వేశావా..? 1.52 లక్షల మందికి బీమా అందించాం. ఈ జిల్లాలోని అందరు రైతులకు బీమా పే చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ఇన్సూరెన్స్‌ కట్టలేదని ఆరోపిస్తాడు. కనీస వాస్తవాలు కూడా తెలుసుకోవడం లేదు. రైతులు చనిపోతే వారి శవాల వద్దకు వచ్చి రాజకీయాలు చేద్దామనుకుంటున్నాడు. శవ రాజకీయాలు మానేయ్‌ చంద్రబాబూ..నిన్ననే మండపేటలో ఒకరికి కాలు పోయింది. నువ్వు దరిద్రుడివై ఉండి మా ముఖ్యమంత్రిని అంటున్నావు. ఇప్పటికైనా చంద్రబాబూ ప్రజల్ని హింసించకు. నీ కొడుకును అధికారంలోకి తేవాలనే నీ కాంక్ష నెరవేరదు. ఏ పంట సీజన్లో పంటకు నష్టం వాటిల్లితే అదే సీజన్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రభుత్వం జగన్‌ ప్రభుత్వం.  ఇన్‌ పుట్‌ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చావా చంద్రబాబూ.. అలా చేయకుండా ఇప్పుడొచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement