సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధరణి పోర్టల్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టినది నిరసన దీక్ష కాదని, ఈర్ష్య దీక్ష! అని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. సోమవారం ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ సునీల్, సుడా చైర్మన్ జీవీఆర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ దీక్షలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ప్రత్యారోపణలతో గంగుల తిప్పికొట్టారు.
తొలుత సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ రాష్ట్ర సమస్యలు పరిష్కరించేలా దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. ‘సంజయ్ మౌనదీక్షలో కేసీఆర్ కోసం మహారాజా కుర్చీ వేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నిజంగా మహారాజే’అని గంగుల కొనియాడారు. ధరణితో 98 శాతం భూసమస్యలు తగ్గి గ్రామాల్లో గొడవలు సమసిపోయాయన్నారు. అకాల వర్షాలతో రెవెన్యూ సదస్సులు వాయిదా పడ్డాయని చెప్పారు. కేంద్రం విస్మరించిన హామీలపై కూడా కుర్చీలు వేసి తనతోపాటు ధర్నాలు చేయాలని ఆహ్వానించారు.
బీసీ కులగణన కోరుతూ నిరసన చేయాలి..
ప్రతీ భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేయనందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు కుర్చీలేసి నిరసన తెలపాలని గంగుల సూచించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు యూపీఎస్సీ కార్యాలయం ముందు, విదేశాల నుంచి నల్లధనం తేనందుకు ఆర్బీఐ, ఈడీ కార్యాలయాల ముందు, గ్యాస్ సిలిండర్లు్ల, పెట్రోల్ ధరలు పెంచినందుకు బంకుల ఎదుట, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుల ముందు ధర్నాకు రావాలని సంజయ్‌కు సవాల్ విసిరారు.
బీసీలు ఓట్లేస్తే గెలిచిన సంజయ్ బీసీ గణన చేపట్టాలని కోరుతూ నిరసన చేయాలని హితవు పలికారు. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గానికి ఎంపీ నిధులు విడుదల చేయడంలేదని, ముందు వాటిపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ సంజయ్ మతి భ్రమించిందని, ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాలని
ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment