
బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల
కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): ‘మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూట్లో రాయి తీయలేని వాడు.. ఏట్లో రాయి తీస్తడట. జిల్లాలో ఇంత అవినీతి జరుగుతుంటే.. ఏనాడైనా మాట్లాడావా’ అంటూ బండి సంజయ్‌ను నిలదీశారు. ఈడీ వచ్చి మంత్రి ఇంట్లో సోదాలు చేస్తుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా మంగళవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. తొండ ముదిరి ఊసర వెల్లి అయినట్లు.. గంగుల ముదిరి రంగుల కమలాకర్ అయ్యాడన్నారు. గ్రానైట్, ఇసుక, గుట్కా మాఫియాకు తోడు భూ కబ్జాలు చేస్తూ కరీంనగర్ డాన్ అయ్యాడని ఆరోపించారు. సభలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి.రాంరెడ్డి, డా.నగేష్, బి.అనిల్‌కుమార్, అక్కెనపల్లి కుమార్ పాల్గొన్నారు.