కరీంనగర్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితోపాటు పవన్ కల్యాణ్, షర్మిల, కేఏ పాల్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హైదరాబాద్‌పై కన్నేశారని, వారంతా ఒకేతాను ముక్కలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ వై.సునీల్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి సాధించిందన్నారు. చంద్రబాబు ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం, పవన్‌కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వారాహి ప్రచార రథాన్ని ప్రారంభిస్తాననడం, షర్మిల రాష్ట్రంలో పాదయాత్రలు చేయడం చూస్తుంటే గతంలో తెలంగాణ సంపదను దోచుకున్న వారి చరిత్ర, తీరు మార్చుకోలేదని నిరూపితమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసిన వారు మరోసారి తెలంగాణలో విషబీజాలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు. మరోసారి ఎలాగైనా రాష్ట్రంలో టీడీపీ పాగా వేయాలని చూస్తోందని, అందుకే.. వెళ్లిపోయిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునివ్వడంతో బాబు నైజం బయటపడిందని విమర్శించారు. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్, షర్మిల, కేఏ పాల్ బీజేపీ విసిరిన బాణాలేనని, వేర్వేరు వేషాల్లో గద్దల్లా వాలుతున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment