కరీంనగర్‌టౌన్: కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రం ఒత్తిడి చేస్తుంటే బీజేపీ అధ్యక్షుడు దీక్ష పేరుతో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తి చెందితే బాధ్యులెవరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయన చేపట్టింది జాగరణ దీక్ష కాదని, డ్రామాదీక్ష అని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో ఒమిక్రాన్ ప్రబలితే దానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి తన దీక్షను ప్రధాని మోదీ ఇంటిముందు చేసి కోటి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేయాలన్నారు.అనుమతి తీసుకోకుండా దీక్ష చేసింది చాలక రాద్ధాంతం చేశారన్నారు. గుర్తింపు పొం దిన 8 సంఘాలతోపాటు వేరే సంఘాలు కూడా 317 జీఓ నిర్ణయంపై జరిగిన చర్చలో పాల్గొన్నాయని, అన్నీ చర్చించాకే జీవో తెచ్చామని స్పష్టం చేశారు.
బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్ పోలీసులు మంచి పనిచేశారని, లేకుంటే మహమ్మారి ప్రబలేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ అతీతులు కారన్నారు. కేంద్రం చెబుతున్న నిబంధనలను అదే పార్టీకి చెందిన ఎంపీ ఉల్లంఘించడం సరికాదన్నారు. తమకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment