రుంజ వాయిద్యం వాయిస్తున్న మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్/దుబ్బాకటౌన్: బీడీ కట్టల మీద, పాల మీద జీఎస్‌టీ వేసి, గ్యాస్ ధరలు పెంచి, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పిన బీజేపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓట్లకోసం గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నేతలను ఈ అంశాలపై నిలదీసి చీపుర్లతో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌర స్తాలో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ వంద అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఏనాడూ గజ్వేల్ ప్రజలను పట్టించుకోని ఈటల రాజేందర్ ఇప్పుడు కొత్తగా ఎన్నికల బరిలో కి వచ్చి.. వరుసలు కలుపుతూ తెగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిన్నింటి వాసా లు లెక్కపెట్టేవిధంగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌పైనే పోటీకి దిగడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ వస్తే కటిక చికటే మిగులుతుందని, ఆ పార్టీ కర్ణాటకలో కనీసం మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతోందని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇదే రకమైన పరిస్థితి వస్తుందన్నారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత విధానాలతో వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే అసైన్డ్ భూములపై పూర్తి హక్కులను కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుంజ వాయిద్యంతో ఆకట్టుకున్న మంత్రి
సీఎం కేసీఆర్‌కు మద్దతుగా సోమవారం నిర్వహించిన విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు రుంజ వాయిద్యం వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. విశ్వకర్మలకు చెందిన రుంజ కళాకారులు ఈ వాయిద్యంతో అందరినీ అలరిస్తుంటారు. హరీశ్‌రావు సైతం కొద్దిసేపు వాయించి సభికులను ఉత్సాహపరిచారు. కాగా సీఎం కేసీఆర్‌కే మా మద్దతు అంటూ.. విశ్వకర్మ సంఘం నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రికి పత్రాలు అందజేశారు.
బీజేపీ డకౌట్.. కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్
రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ వస్తుందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు తామే అధికారంలోకి వస్తామంటూ చెబుతున్నారని, కానీ వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. బీజేపీపై నమ్మకం లేకనే ఆ పార్టీ నుంచి విజయశాంతి, వివేక్, రాజగోపాల్‌రెడ్డితో పాటు రోజుకో నాయకుడు బయటకు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment