నల్లగొండటూటౌన్/మర్రిగూడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గల్లీ లీడరని, ఆయన వీధిరౌడీలా మాట్లాడుతున్నారని, ఈడీబోడీలకు భయపడేది లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు మర్రిగూడ మండలంలోని భారతీగార్డెన్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందని అన్నారు. ఈడీ బోడీ అంటూ బీజేపీ బెదిరింపులతో సీఎం కేసీఆర్‌ను లొంగదీసుకోవాలని చూస్తోందని, అది ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. చట్టబద్ధ సంస్థ అయిన ఈడీని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.
బీజేపీ దుర్మార్గాలను, ప్రధాని మోదీ అసమర్థ పాలనను ఎండగట్టేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలంటున్న వామపక్షాలు మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కోరారు. మోదీ ఇచ్చిన రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుతో రాజగోపాల్‌రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు.
మునుగోడు రైతులకు మీటర్లు పెట్టిస్తావా
‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లి మునుగోడు రైతులకు మీటర్లు పెట్టిస్తావా.. రాజగోపాల్‌రెడ్డీ..’అని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రూ.22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం నమ్మి బీఫాం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన స్వార్థపరుడు రాజగోపాల్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి ఓర్వలేక ఉచిత పథకాలను పెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం అనడం సిగ్గుచేటన్నారు. ‘కుటుంబపాలన ఎక్కడ ఉంది.. మీ ఇంట్లోనే ఉంది. దొంగే దొంగా దొంగా.. అని అరిచిన చందంగా కోమటిరెడ్డి తీరు ఉంది’అని ధ్వజమెత్తారు.
చదవండి: గాల్లోకి మంత్రి కాల్పులు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment