నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌లపై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని జైల్లో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు.
కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నాడని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమాలపై కోర్టులకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పారు.
వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్‌కు కూడా అర్థమైందని తెలుస్తోందన్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment